మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే

July 17, 2019


img

నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆ ప్రాంతానికే చెందిన చిలుకూరు బాలు అనే కాంగ్రెస్‌ నేత పట్టణంలో ఓటర్ల జాబితాలు, వార్డుల విభజనలో చాలా అవకతవకలు జరిగాయని ఫిర్యాదు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, దానికి కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించరాదని మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక మునుపే వాటి నిలుపుదలకు కోర్టులో పిటిషనన్లు, వాటిపై హైకోర్టు స్టే విధించడాలు మొదలైపోయాయి.

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పొందడం, ఆ తరువాత 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించడంతో కాంగ్రెస్ పార్టీ చాలా నిరుత్సాహంగా ఉంది. కనుక ఈసారి మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ మానసికంగా సిద్దం కాకపోవడంతో ఈవిధంగా కోర్టులో పిటిషన్లు వేసి ఎన్నికలను నిలిపివేయడానికి ప్రయత్నిస్తోందా లేక నిజంగానే ఓటర్ల జాబితాలలో, వార్డుల విభజనలో అవకతవకలు జరిగాయా? అనే సందేహాలకు త్వరలో సమాధానాలు లభిస్తాయని ఆశిద్దాం.


Related Post