ఖమ్మం ఎస్సీ బాలికల హాస్టల్లో అగ్నిప్రమాదం

July 16, 2019


img

మ్మంలోని ఎస్ఎస్.పి కాలనీలోని ఎస్సీ బాలికల వసతిగృహంలో ఆదివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం సంగతి తెలుసుకున్న స్థానికులు తక్షణమే అక్కడకు చేరుకొని హాస్టల్లో ఉన్న 34 మంది బాలికలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చి రక్షించారు. ఈ ప్రమాదంలో 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ళ వయసున్న స్పందన అనే బాలిక చనిపోయింది. ఆమెను రక్షించడానికి హాస్టల్ లోపల గదిలోకి వెళ్ళిన స్థానికులకు కాలిపోయిన ఆమె మృతదేహం కనబడింది. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక దళానికి, 108 అంబులెన్స్ సర్వీసులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో వారందరూ హుటాహుటిన అక్కడకు చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సుమారు అర్ధగంటసేపు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలికలను ఆసుపత్రిలో చేర్చారు. ఆరోజు ఆదివారం శలవు దినం కావడంతో ఆ హాస్టల్లో ఉంటున్న మరో 100 మందికి పైగా విద్యార్ధినులు తమ ఇళ్ళకు వెళ్ళడంతో పెను ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నిజానికి ఆ హాస్టల్లో చాలా కాలంగా విద్యుత్ వైర్లు, స్విచ్‌ బోర్డులు ప్రమాదకరంగా ఉన్నాయని విద్యార్ధినులు చెపుతున్నారు. భయానకమైన ఈ అగ్నిప్రమాదం చూసి హాస్టల్లో ఉంటున్న బాలికలు తీవ్ర ఆందోళనగా ఉన్నారు. పోలీసులు వారి తల్లితండ్రులకు సమాచారం ఇచ్చి రప్పించారు. హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యానికి ఒక విద్యార్ధిని బలైపోవడం చూసి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ నిర్వాహకులపై తక్షణం చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. 

 

ఈ ఘటనపై స్పందించిన ఎస్సీ, ఎస్టీ కమీషన్ చనిపోయిన విద్యార్ధిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం, ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఆదేశించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందజేయాలని, బాధ్యులపై చట్టప్రకారం కటినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇకనైనా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితిపై ప్రభుత్వం అధ్యయనం చేయించి అవసరమైన మరమత్తులు చేయిస్తే భవిష్యత్‌లో మళ్ళీ ఇటువంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు.


Related Post