తెలంగాణలో కూడా ప్రైవేట్ యూనివర్సిటీలు

July 16, 2019


img

దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాలలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయి కానీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంతవరకు ఏర్పాటుకాలేదు. వాటి ఏర్పాటు కోసం గత ఏడాది మార్చిలోనే శాసనసభ చట్టం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు దాని అమలుతేదీని, మార్గదర్శకాలను ప్రకటించకపోవడం వలన ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు కాలేకపోయాయి. తాజాగా జూలై 15వ తేదీ నుంచి ఆ చట్టం అమలులోకి వచ్చినట్లు విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కనుక త్వరలోనే వాటి ఏర్పాటుకు సంబందించి మార్గదర్శకాలను కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. అవి కూడా విడుదలైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంటుంది. 

ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజిమెంట్, ఫార్మసీ వంటి రెగ్యులర్ కోర్సులే కాకుండా మార్కెట్ అవసరాలకు తగ్గట్లుగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలనుకొంటున్న యూనివర్శిటీలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్రైవేట్ యూనివర్శిటీలలో 25 శాతం సీట్లు తెలంగాణ విద్యార్ధులకు కేటాయించబడతాయి. కానీ వీటిలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవు. కోర్సులు, ప్రవేశాల విషయంలో యూనివర్సిటీలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది కానీ ఫీజుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలోని కమిటీ నిర్ణయిస్తుంది. యూనివర్సిటీ ఏర్పాటు చేసిన 5 ఏళ్ళులోపుగా న్యాక్ గుర్తింపు పొందవలసి ఉంటుంది. 

ప్రైవేట్ యూనివర్సిటీల రాకతో ఇప్పటికే పలుసమస్యలతో సతమతమవుతున ఉస్మానియా, కాకతీయ వంటి ప్రభుత్వ యూనివర్సిటీల మనుగడ ప్రశ్నార్ధకంకావచ్చునని విద్యావేత్తలు ఆందోళన చేయవచ్చు.


Related Post