కుమారా...విశ్వాసమా...అవిశ్వాసమా?

July 15, 2019


img

కర్ణాటకలో 16 మంది ఎమ్మెల్యేల రాజీనామాలతో సంక్షోభంలో చిక్కుకున్న కుమారస్వామి ప్రభుత్వం నేడు ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకొంది. శాసనసభలో బలపరీక్షకు సిద్దమని కుమారస్వామి చెప్పడంతో స్పీకర్ రమేశ్ కుమార్ సోమవారం శాసనసభను సమావేశపరిచారు. కానీ అదే సమయంలో ఎడ్యూరప్ప నేతృత్వంలో బిజెపి ఎమ్మెల్యేలు  స్పీకర్‌ను కలిసి కుమారస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేశారు.

కుమారస్వామి ప్రభుత్వం శాసనసభలో బలం కోల్పోయినప్పటికీ రాజీనామా చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని, కనుక తక్షణమే ఆయన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి అనుమతించాలని వారు స్పీకర్‌ను కోరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వానికి బలనిరూపణ చేసుకునేందుకు అనుమతించాలా లేక రెబెల్ ఎమ్మెల్యేలు మనసు మార్చుకోనందున అవిశ్వాస తీర్మానాన్ని అనుమతించలా? అనే డైలమాలో పడ్డారు స్పీకర్ రమేశ్ కుమార్.

ఈ సమస్యపై చర్చించేందుకు స్పీకర్ రమేశ్ కుమార్ అధ్యక్షతన మరికొద్ది సేపటిలో అధికార, ప్రతిపక్ష నేతలతో కూడిన విధానసభ సలహాసమితి సమావేశం జరుగనుంది. ఒకవేళ దానిలో కూడా ఎటువంటి పరిష్కారం లభించనట్లయితే సభను రేపటికి వాయిదావేసే అవకాశం ఉంది. ఈ తాజా పరిణామాల నేపద్యంలో కాంగ్రెస్‌, జెడిఎస్, బిజెపిలు తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకునేందుకు వారిని మళ్ళీ క్యాంపులకు తరలించాయి. మంగళవారం వరకు యధాతధ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారాలపై సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post