బిజెపిలో చేరుతున్నా: సోమారపు

July 15, 2019


img

తెరాసకు రాజీనామా చేసి బయటకు వచ్చేసిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ తాను బిజెపిలో చేరబోతున్నట్లు ఆదివారం ప్రకటించారు. బిజెపి ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ తదితరులు ఆదివారం గోదావరిఖనిలోని ఆయన ఇంటికి వెళ్ళి బిజెపిలో చేరవలసిందిగా ఆహ్వానించగా అందుకు ఆయన తక్షణం అంగీకారం తెలిపారు. 

ఈ సందర్భంగా వారితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ, “రామగుండం అభివృద్ధికి, తెరాసను బలోపేతం చేసేందుకు నా శక్తిమేర కృషిచేశాను. నియోజకవర్గంలో ప్రజలు నా సేవలను గుర్తించి గౌరవించారు కానీ తెరాస నేతలు మాత్రం గుర్తించలేదు. అసెంబ్లీ ఎన్నికలలో నన్ను ఓడించేందుకు అందరూ కలిసి కుట్రపన్నారు. కేటీఆర్‌ కారణంగానే తెరాసలో నాకు తగిన స్థానం లేకుండాపోయింది. అందుకే పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో నన్ను పక్కనపెట్టారు. నాకు గౌరవం లేని చోట నేను కొనసాగలేను. ఎంపీలు ధర్మపురి అర్వింద్, బండి సంజయ్ ఆహ్వానాన్ని మన్నించి బిజెపిలో చేరాలని నిశ్చయించుకున్నాను. నాతోపాటు మాజీ కార్పొరేటర్లు స్వరూప, కృష్ణ, కిషన్‌రెడ్డి, లావణ్య, ప్రవీణ్‌, సుజాత, ఇంకా అనేకమంది స్థానిక తెరాస నాయకులు భాజపాలో చేరుతున్నారు,” అని చెప్పారు. 

తెరాస ఇమడలేక ఇబ్బంది పడుతున్న సోమారపు సత్యనారాయణ బహుశః బిజెపిలో చేరే ఆలోచనతోనే పార్టీని వీడి ఉంటారు. అయితే తాను ఏ పార్టీలోను చేరబోనని చెప్పిన రెండురోజులకే బిజెపిలో చేరుతున్నట్లు ప్రకటించడం విశేషం. తెరాసకు ప్రతీ జిల్లాలోను బలమైన నాయకులున్నారు కనుక వారిమద్య ఆధిపత్యపోరు కొనసాగడం సహజం. కానీ బిజెపిలో అంతమంది లేరు కనుక సోమారపు సత్యనారాయణ బిజెపిలో సులువుగానే ఇమిడిపోవచ్చు.


Related Post