అర్ధరాత్రి వరకు సాగిన లోక్‌సభ సమావేశాలు

July 13, 2019


img

ప్రజాసమస్యలపై చర్చ పేరుతో పార్లమెంటులో, శాసనసభలలో ప్రజాప్రతినిధులు పరస్పరవిమర్శలు చేసుకోవడం రోజూ చూస్తూనే ఉంటాము. గత 18 ఏళ్ళలో తొలిసారిగా గురువారం అర్ధరాత్రి వరకు లోక్‌సభ సమావేశం కొనసాగింది. దానిలో అధికార ఎన్డీయేతో సహా సుమారు 100 మంది ఎంపీలు పాల్గొనడం మరో విశేషం. వారందరూ బడ్జెట్‌లో రైల్వే శాఖకు చేసిన కేటాయింపులపై లోతుగా చర్చించారు.

అర్ధరాత్రి అయినా టీవీ ఛానళ్ళలో ప్రకటనలు ఆగనట్లే, అర్ధరాత్రి వరకు లోక్‌సభ సమావేశం కొనసాగినా అధికార, ప్రతిపక్ష ఎంపీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోలేదు. గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు ఎంత ప్రాధాన్యం ఇచ్చిందో బిజెపి ఎంపీలు వివరిస్తుంటే, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైల్వే ఆస్తులను అమ్మివేసుకొంటూ రైల్వేని ప్రైవేట్ పరం చేస్తోందని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. రైల్వేలకు బడ్జెట్‌లో కేంద్రప్రభుత్వం చేసిన కేటాయింపులపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంపై గురువారం మధ్యాహ్నం మొదలైన వారి చర్చ (వాదోపవాదాలు) ఏకబిగిన అర్ధరాత్రి వరకు సాగాయి.


Related Post