డబ్బు సంచులతో అధికారం? రాహుల్ గాంధీ

July 12, 2019


img

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్ణాటకలో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై తీవ్రంగా స్పందించారు. “బిజెపి డబ్బు సంచులు కుమ్మరించి రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చాలని ప్రయత్నిస్తోంది. ఇంతకు ముందు ఈశాన్య రాష్ట్రాలలో అలాగే చేసింది. ఇప్పుడు కర్ణాటకలో అదే చేస్తోంది. డబ్బు సంచులు కుమ్మరించి బిజెపియేతర ప్రభుత్వాలను అస్థిరపరచాలని చూడటం చాలా హేయమైన చర్య,” అని అన్నారు.

ఈ సమస్యను శుక్రవారం సాయంత్రంలోగా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు 15 మంది రెబెల్ కాంగ్రెస్‌-జెడిఎస్ ఎమ్మెల్యేలకు, వారి ప్రభుత్వానికి సూచించినప్పటికీ, స్పీకర్ రమేశ్ కుమార్ వారి రాజీనామాలను ఆమోదించకుండా, వారితో సహా మిగిలిన కాంగ్రెస్‌, జెడిఎస్ శాసనసభ్యులందరికీ విప్ జారీ నేటి నుంచి శాసనసభ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించడంతో కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. 

స్పీకరు ఎప్పుడు కోరితే అప్పుడు శాసనసభలో బలపరీక్షకు సిద్దంగా ఉన్నానని సిఎం కుమారస్వామి, సిఎం ఎప్పుడు కోరితే అప్పుడు శాసనసభను సమావేశపరచడానికి సిద్దంగా ఉన్నానని స్పీకర్ చెపుతుండటంతో కొత్త నాటకం మొదలైంది. 

ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రీంకోర్టు మంగళవారం ఈ కేసుపై విచారణ చేపడతామని అప్పటి వరకు రెబెల్ ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోరాదని, అప్పటి వరకు యదాతధస్థితి కొనసాగించాలని ఆదేశించడంతో మళ్ళీ కాంగ్రెస్‌, జెడిఎస్, బిజెపి ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలు మొదలైపోయాయి.


Related Post