కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్ పనులకు రూ.200 కోట్లు

July 12, 2019


img

కొత్తపల్లి–మనోహరాబాద్‌ రైల్వేలైన్ నిర్మాణానికి 2005-06 సం.లలో రూ.1,160 కోట్లు అంచనా వేసింది. నిజానికి అదేమీ పెద్ద మొత్తం కాదు. కేంద్రప్రభుత్వం తలుచుకుంటే ఒకేసారి విడుదల చేయగలదు. కానీ అప్పటి నుంచి ఏడాదికి కొంత చొప్పున మంజూరు చేస్తున్నందున నేటికీ దాని నిర్మాణపనులు పూర్తికాలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెరాస అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాతాగా రూ.77 కోట్లు చెల్లించి, భూసేకరణ పనులు పూర్తి చేసి ఇవ్వడంతో రైల్వేలైన్ పనులలో వేగం పెరిగింది. 2015-16లో రూ.20 కోట్లు, 2016-17లో రూ.30 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్న కేంద్రప్రభుత్వం, తెరాస ఎంపీలు, ప్రభుత్వం ఒత్తిడి కారణంగా 2017-18లో రూ.325కోట్లు, 2018-19లో 125 కోట్లు విడుదల చేయడంతో పనులు జోరందుకున్నాయి.    ఈ ఆర్ధిక సంవత్సరానికి కేంద్రప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది కనుక నిర్మాణపనూ చురుకుగా సాగే అవకాశం ఉంది.



కొత్తపల్లి–మనోహరాబాద్‌ మద్య 150 కిమీ దూరం ఉంది. దానిలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32కిమీ రైల్వే ట్రాక్ నిర్మించవలసి ఉండగా 26 కిమీ నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం మనోహరాబాద్ మండలంలోని రామాయిపల్లి వద్ద రూ.100 కోట్లతో చేపట్టిన అండర్ బ్రిడ్జి నిర్మాణపనులు జోరుగా సాగుతున్నాయి. 2020 మార్చిలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తవుతుందని దీని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న రైల్వే అధికారి తెలిపారు. అప్పటి లోగా మిగిలిన 5-6కిమీ ట్రాక్ నిర్మాణం కూడా పూర్తవుతుంది కనుక 2020 మార్చి లేదా ఏప్రిల్ నెలలోగా గజ్వేల్ వరకు రైలు బండి వచ్చేస్తుంది. 


రెండవ దశలో గజ్వేల్ నుంచి సిద్ధిపేటవరకు, 3వ దశలో సిద్ధిపేట నుంచి సిరిసిల్లా వరకు, 4వ దశలో సిరిసిల్లా నుంచి కొత్తపల్లి వరకు రైల్వేలైన్ నిర్మించబడుతుంది. ఈ లైన్ మొత్తం పూర్తయితే ఉత్తర తెలంగాణలో చాలా ప్రాంతాలకు రాష్ట్ర రాజధానితో అనుసంధానం అవుతాయి కనుక ఆయా ప్రాణాతల ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంటుంది.


Related Post