గూడ్స్ రైళ్ళలో చెన్నైకి త్రాగునీరు సరఫరా

July 12, 2019


img

చెన్నై నగరానికి త్రాగునీటిని అందించే పూండి, చెంబరంబాక్కం, షోలవరం, రెడ్ హిల్స్ చెరువులు పూర్తిగా ఎండిపోవడం, అదే సమయంలో నగరంలోని భూగర్భజలాలు అడుగంటిపోవడంతో చెన్నై నగరవాసులు గత రెండుమూడు నెలలుగా గుక్కెడు నీటి కోసం అల్లాడిపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి తమిళనాడు ప్రభుత్వం రైల్వేలను ఆశ్రయించింది. గతంలో మహారాష్ట్రలో లాతూరులో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు, గూడ్స్ రైళ్ళ ద్వారా త్రాగునీటిని సరఫరా చేశారు. ఇప్పుడు అదేవిధంగా రాష్ట్రంలోని వెల్లూరు జిల్లాలోని జోలార్ పేట నుంచి చెన్నైకి రోజుకు 10 లక్షల లీటర్లను తీసుకువచ్చి చెన్నై నగరవాసులకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నేటి నుంచి ఆరు నెలలపాటు ఈ నీటి సరఫరా కార్యక్రమం కొనసాగించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. 

నవంబర్ 2015లో బారీ వరదలు రావడంతో చెన్నై నగరం పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడు త్రాగడానికి చుక్క నీళ్ళు లేక అల్లాడుతోంది. జయలలిత ఆకస్మికంగా చనిపోయినప్పుడు అధికారం ఏవిధంగా చేజిక్కించుకోవాలని రకరకాలుగా ఆలోచనలు చేసిన అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, నగరంలో ఇటువంటి భిన్నమైన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? ఈ సమస్యలను ఏవిధంగా పరిష్కరించాలి? అని ఆలోచించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. తమ లోపాలను, వైఫల్యాలను కప్పి పుచ్చుకొంటూ ఇప్పుడు ట్యాంకర్ రైళ్ళలో చెన్నైకి త్రాగునీరు సరఫరా చేసి ప్రజల దాహర్తి తీర్చుతున్నామని గొప్పగా చెప్పుకొంటున్నారు. దేశంలో పట్టణాలు, నగరాలలో శరవేగంగా జనాభా పెరిగిపోతున్నందున అందుకు తగ్గట్టుగా మంచినీటితో సహా అన్ని మౌలికావసతులు యుద్ధప్రాతిపాదికన ఏర్పాటు చేసుకోవలసి ఉంటుందని గ్రహించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌, సికిందరాబాద్‌తో సహా రాష్ట్రంలో ప్రధాన పట్టణాలకు త్రాగునీరు, రోడ్లు, కాలువలు, వైద్యం వంటి మౌలికవసతులు కల్పనపై ప్రత్యేకశ్రద్ద పెట్టి భారీగా ఏర్పాటు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. పాలకులకు ఇటువంటి దూరదృష్టి, నిబద్దత ఉన్నట్లయితే రైళ్ళలో నీళ్ళు తెచ్చుకోవలసిన ‘దుర్గతి’ పట్టదు.


Related Post