ఆయనే మమ్మల్ని తొక్కేసారు: తెరాస ఎమ్మెల్యే

July 10, 2019


img

తెరాస మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ నిన్న పార్టీ వీడుతూ తెరాస ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై చేసిన విమర్శలకు తెరాస ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వెంటనే ఘాటుగా బదులిచ్చారు. “సిఎం కేసీఆర్‌ తనకు అడగకుండానే ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని చెప్పుకున్న సోమారపు, అదే నోటితో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లభించడం లేదని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ పార్టీలో ఉద్యమకారులను, పార్టీ నేతలను అణగ ద్రొక్కేసేవారు. సర్పంచ్ ఎన్నికలలో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి నష్టం కలిగించారు. ఆయన తన కొడుకును రాజకీయాలలోకి తీసుకురావాలనే ఆలోచనతోనే పార్టీపై విమర్శలు చేస్తూ వీడారు తప్ప పార్టీలో సముచిత స్థానం లభించక కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన బాలఖాళీలోకి వెళుతున్నారు,” అని అన్నారు. 

సోమారపు, కోరుకంటి విమర్శలు, ప్రతివిమర్శల ద్వారా తెరాసలో నేతల మద్య అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయనే విషయం బయటపడింది. గతంలో రామగుండం మేయరుగా ఉన్న కొంకటి లక్ష్మినారాయణపై సోమారపు తన అనుచరులచేత అవిశ్వాసం పెట్టించి ఆయన పదవి ఊడగొట్టారు. కనుక స్థానిక తెరాస నేతలలో ఆయన పట్ల వ్యతిరేకత ఏర్పడటం సహజం కనుక బహుశః వారు ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో సహకరించకపోవడంతో ఓడిపోయారు. సర్పంచ్ ఎన్నికలలో సోమారపు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కనుక తెరాస ఆయనను పక్కనపెట్టడం సహజమే. ఆయన తన కొడుకును రాజకీయాలలోకి తీసుకురావాలనుకుంటే పార్టీలో అందరితో సంబందాలు బలపరుచుకొనే ప్రయత్నాలు చేయాలి. కానీ శతృత్వం పెంచుకొని నష్టపోయారనిపిస్తుంది.


Related Post