బిజెపికి తెరాస వార్నింగ్

June 26, 2019


img

రాష్ట్రంలో బిజెపికి ఏమాత్రం బలం, ప్రజాధారణ లేకపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకోవడంతో రాష్ట్ర బిజెపి నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, నలుగురు ఎంపీలు వాపును చూసి బలుపు అనుకొంటూ విర్రవీగుతున్నారని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేంద్రహోంశాఖ సహాయమంత్రిగా నియమితులైన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌ నగరం ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని బాధ్యతారహితంగా మాట్లాడితే, అదిలాబాద్ బిజెపి ఎంపీ సోయం బాపూరావు తలలు నరుకుతానంటూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి సంజయ్ ముగ్గురూ కూడా ప్రజల మద్య చిచ్చుపెట్టేవిధంగా మాట్లాడుతున్నారని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

రాష్ట్ర బిజెపి నేతలు పదేపదే పశ్చిమబెంగాల్ తరహా ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో కూడా జరుగుతాయని చెప్పడంలో అర్ధం ఏమిటని ప్రభాకర్ ప్రశ్నించారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక రాష్ట్రాలలో మాదిరిగానే తెలంగాణలో కూడా సమస్యలు సృష్టించి రాష్ట్రంలో పాగా వేయాలనే బిజెపి ప్రయత్నాలు ఫలించవని ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకున్నారనే సంగతి గ్రహించకుండా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశ్యంతో ప్రజల మద్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి పాగా వేయాలనుకుంటే చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలు బిజెపి నేతలకు తగిన విధంగా బుద్ధి చెపుతారని ప్రభాకర్ హెచ్చరించారు.

సాధారణంగా ఇటువంటి వ్యవహారాలపై పార్టీ అధిష్టానం సూచనల మేరకే దిగువస్థాయి నేతలు స్పందిస్తుంటారనే విషయం అందరికీ తెలిసిందే. కనుక బిజెపి నేతలను ఉద్దేశ్యించి కర్నే ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు తెరాస అధిష్టాన వైఖరిగానే భావించవచ్చు. అంటే బిజెపిని ఎదుర్కోవడానికి తెరాస అప్పుడే సిద్దం అవుతోందని అర్దమవుతోంది. బిజెపి కూడా ఇదే (తెరాసతో యుద్ధం) కోరుకొంటోంది కనుక రానున్న రోజులలో బిజెపి-తెరాసల మద్య పోరు పెరుగవచ్చు. 


Related Post