విశాఖ జూలో బుజ్జి జిరాఫీ

June 26, 2019


img

ఏపీలో పర్యాటక ఆకర్షణ కేంద్రాలలో విశాఖపట్టణం ఒకటి. విశాఖ పర్యాటకులను ఇప్పుడు ఒక కొత్త అతిధి అలరిస్తోంది. విశాఖలోని ఇందిరాగాంధీ జంతుప్రదర్శనశాల (జూ)లో ఉన్న జిరాఫీ జంటకు సోమవారం ఒక బుజ్జి జిరాఫీ పుట్టింది. మన దేశంలో కోల్‌కతాలోని ఆలీపూర్ జూ, మైసూరులోని చామరాజేంద్ర జూ, పాట్నా జూలో మాత్రమే జిరాఫీలున్నాయి. వాటికి పిల్లలు కూడా పుట్టాయి. ఇప్పుడు విశాఖ జూలో జిరాఫీ జంట కూడా ఒక ఆడ జిరాఫీ పిల్లకు జన్మనిచ్చింది.          

 ప్రస్తుతం తల్లి జిరాఫీ పిల్లకు పాలు ఇవ్వకపోవడంతో జూ అధికారులు, సింహాచలం గోశాలలో దూడకు జన్మనిచ్చిన ఆవుపాలను తీసుకువచ్చి పిల్ల జిరాఫీకి పడుతున్నారు. ఒక నెలరోజుల వరకు దానిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవలసి ఉంటుందని జూ అధికారులు చెప్పారు. దాని బాగోగులు చూసేందుకు 24 గంటలు ప్రత్యేక సిబ్బందిని, వైద్యనిపుణులను ఏర్పాటు చేశారు. 

సుమారు ఏడేళ్ళ క్రితం విశాఖ జూ అధికారులు మలేసియా నుంచి ఒక జిరాఫీ జంటను తీసుకువచ్చి వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నారు. వారి సంరక్షణలో ఆహ్లాదకరమైన వాతావరణంలో అవి ఆరోగ్యంగా పెరగడంతో అవి జత కట్టి బుజ్జి జిరాఫీకి జన్మనిచ్చాయి. తల్లి జిరాఫీ గర్భం దాల్చినప్పటి నుంచి జూ అధికారులు దానిని 17 నెలలపాటు కంటికి రెప్పలా కాపాడటంతో అది చాలా ఆరోగ్యవంతంగా ఉన్న బుజ్జి జిరాఫీ పిల్లకు జన్మనిచ్చింది. దాని ఎత్తు 5 అడుగులు, బరువు 30 కిలోలు ఉంది. తల్లితోపాటే పచ్చిక బయళ్ళలో తిరుగుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. దానిని చూసి సందర్శకులే కాదు... జూ అధికారులు కూడా చాలా ఆనందంతో పొంగిపోతున్నారు.    


Related Post