నేటి నుంచి హైదరాబాద్‌లో ఇస్టా అంతర్జాతీయ సదస్సు

June 26, 2019


img

నేటి నుంచి హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) సదస్సు ప్రారంభం కానుంది. జూలై 3వరకు సాగే ఈ సదస్సుకు 80 దేశాల నుంచి 700 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సిఎం కేసీఆర్‌ ఇస్టా సదస్సును ప్రారంభోత్సవం చేస్తారు. గవర్నర్‌ నరసింహన్‌ ముగింపు ఉత్సవాలలో పాల్గొంటారు. హైదరాబాద్‌లో నోవాటేల్ హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుంది. తెలంగాణతో సహా దేశంలో అన్ని రాష్ట్రాల ప్రతినిధులు, కేంద్రప్రభుత్వం ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. గురువారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 1,600 మంది రైతులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 

ప్రపంచంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధిక దిగుబడి ఇచ్చే పంటలు పండించవలసిన అవసరం ఉందని గుర్తించిన శాస్త్రవేత్తలు, సాంప్రదాయ పద్దతిలో విత్తనాలు సమకూర్చుకోవడం సరిపోదని, నిరంతరంగా పరిశోధనలు చేయవలసిన అవసరం ఉందని భావించి 1924లో స్విట్జర్లాండ్‌లోని జూరిచ్‌ నగరంలో ఇస్టాను స్థాపించారు. దానిలో భారత్‌తో సహా 81 దేశాలకు చెందిన 400 మంది శాస్త్రవేత్తలు, 226 మంది సీడ్ టెస్టింగ్ లేబొరేటరీ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితులను, చీడపీడలను తట్టుకొని అధికదిగుబడి నిచ్చే విత్తనాలను సృష్టించడమే ఇస్టా లక్ష్యం. అప్పటి నుంచి ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. భారత్‌లో తొలిసారిగా హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటం విశేషం. 


Related Post