ప్రజావేదిక భవనం కూల్చివేత

June 26, 2019


img

టిడిపి హయాంలో రూ.8.9 కోట్లు వ్యయంతో వుండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక భవనాన్ని కూల్చివేయాలని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నిన్న రాత్రి నుంచి కూల్చివేతపనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా నిబందనలకు విరుద్దంగా ఆ భవనాన్ని నిర్మించినందున ఆ అక్రమ కట్టడంలో ప్రభుత్వ సమావేశాలు నిర్వహించుకోవడం సరికాదని ఏపీ సిఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. అందుకే దానిని కూల్చివేయాలని ఆదేశించారు. సిఎం ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి ప్రజావేదిక భవనం కూల్చివేతపనులు నిర్విరామంగా సాగుతున్నాయి. 

ప్రజాపయోగం కోసం గత ప్రభుత్వం నిర్మించిన ఆ భవనాన్ని కూల్చివేయడం సరికాదని, అది ప్రజాధనం వృధాచేయడమేనని, కనుక కూల్చివేత పనూ తక్షణం నిలిపి వేయించాలని కోరుతూ నిన్న రాత్రి ఏపీ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్‌ దాఖలైంది. దానిని వెంటనే విచారణకు చేపట్టిన హైకోర్టు రాత్రి 2.30 గంటల వరకు ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న తరువాత కూల్చివేతను అడ్డుకోవడానికి నిరాకరించింది. ఈ కేసును రెండువారాలకు వాయిదా వేసింది. హైకోర్టు కూడా అభ్యంతరం చెప్పకపోవడంతో ప్రజావేదిక భవనం కూల్చివేత పనులు జోరుగా సాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నంకల్లా భవనం పూర్తిగా నేలమట్టం కానుంది. 

ప్రజావేదికతో కూల్చివేత పనులు పూర్తయిపోవు ప్రారంభం కానున్నాయని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా చెప్పారు. కృష్ణానదీ తీరం వెంబడి చంద్రబాబునాయుడుతో సహా పలువురు టిడిపి నేతలు, రాజకీయనాయకులు, వ్యాపారస్తులు అనేక భారీ అక్రమ కట్టడాలు నిర్మించుకున్నారు. కనుక వాటన్నిటి కూల్చివేతకు ఇది ప్రారంభం అని చెప్పవచ్చు. ప్రజావేదిక తరువాత దానికి సమీపంలోనే ఉన్న మాజీ సిఎం చంద్రబాబునాయుడు నివాసం కూల్చివేసే అవకాశం ఉంది. దీనిపై టిడిపి నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


Related Post