త్వరలో కేసీఆర్‌-జగన్ సమావేశం

June 25, 2019


img

రాష్ట్ర విభజన సమస్యలు, విద్యుత్ ఉద్యోగులు...నదీజలాల పంపకాలు, విద్యుత్ వివాదాలు తదితర అంశాలపై చర్చించేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్‌ ఈనెల 28న ప్రగతి భవన్‌లో సమావేశం కానున్నారు. గత నెల 30న ఏపీ సిఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన సిఎం కేసీఆర్‌, ఈ సమస్యలన్నిటినీ సామరస్యంగా చర్చించుకొని పరిష్కరించుకుందామని ప్రతిపాదించగా, జగన్ అందుకు సానుకూలంగా స్పందించారు. ఇకపై కేంద్రప్రభుత్వం, న్యాయస్థానాల వద్దకు వెళ్లకుండా అన్ని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించుకొంటామని సిఎం కేసీఆర్‌ చెప్పారు. 

కేసీఆర్‌-జగన్ భేటీ తరువాత మళ్ళీ వచ్చే నెల 3వ తేదీన గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రధానకార్యదర్శులు భేటీ అయ్యి మరింత లోతుగా చర్చించబోతున్నారు. ఈ రెండు సమావేశాల తరువాత మళ్ళీ ఇరు రాష్ట్రాల అధికారులు అమరావతిలో సమావేశమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇరువురు ముఖ్యమంత్రుల మద్య సఖ్యత ఏర్పడినందున చాలా వరకు సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

ఈవిధంగా బాధ్యతగా, పరిపక్వతతో మెలగవలసిన రెండు ప్రభుత్వాలు... రెండు పార్టీల అధినేతల పంతాలు పట్టింపులు, రాజకీయాల కారణంగా గత ఐదేళ్ళుగా విభజన సమస్యలు అపరిష్కృతంగా నిలిచిపోవడం చాలా శోచనీయం. కనీసం ఇప్పటికైనా ఇరురువురు ముఖ్యమంత్రులు సమస్యల పరిష్కారానికి నడుం బిగించడం హర్షణీయం. 


Related Post