తెరాస కార్యాలయాలకు భూమిపూజలు

June 25, 2019


img

సిఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు రాష్ట్రంలో అన్ని జిల్లాలలో తెరాస మంత్రులు, నేతలు పార్టీ కార్యాలయాల నిర్మాణానికి సోమవారం భూమి పూజలు చేశారు.  తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు వద్ద పార్టీ కార్యాలయానికి శంఖుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంతో కోట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌, రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. దశాబ్ధాలుగా వివక్షకు గురై బీడువారిన భూములన్నిటికీ నీళ్ళు అందించి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సిఎం కేసీఆర్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఇంకా అనేక కుట్రలు, కుతంత్రాలు, సవాళ్లను ఎదుర్కోవలసివస్తుండటం బాధాకరం. ఇటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా సిఎం కేసీఆర్‌ ఏమాత్రం వెనక్కు తగ్గకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు.

తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్రప్రభుత్వం, ఇతర పార్టీలతోనే కాదు... దేవుడితోనైనా కొట్లాడేందుకు సిఎం కేసీఆర్‌ ఎప్పుడూ సిద్దంగా ఉంటారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పధకాలు, అభివృద్ధి ఫలాలను ప్రజల వద్దకు చేరాలంటే గ్రామస్థాయి వరకు పార్టీ విస్తరించాల్సిన అవసరం ఉంది కనుక ప్రతీ జిల్లాలో ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాము. ఈనెల 27వ తేదీ నుంచి తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుంది కనుక పల్లెపల్లెలో దీనిని ఒక పండుగలా నిర్వహించాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సభ్యులకు ఉచిత భీమా, సంక్షేమ పధకాల వర్తింపజేసేందుకు ఆలోచన చేస్తున్నాము,” అని కేటీఆర్‌ తెలిపారు.


Related Post