సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ పిటిషన్‌

June 24, 2019


img

ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి దాని స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలనే సిఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోమవారం హైకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలైంది. మూడేళ్ళ క్రితం సచివాలయాన్ని ఎర్రగడ్డ ఆసుపత్రి వద్ద గల భవనాలలోకి తరలించి, సచివాలయాన్ని కూల్చివేయడానికి ప్రభుత్వం సిద్దం అయినప్పుడు కూడా ఇదేవిధంగా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైందని, అప్పుడు సచివాలయాన్ని కూల్చివేయబోమని ఇదే ప్రభుత్వం అఫిడవిట్ ద్వారా న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిందని పిటిషనర్ హైకోర్టుకు గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం హైకోర్టుకు ఇచ్చిన హామీని పట్టించుకోకుండా మళ్ళీ కూల్చివేతకు సిద్దం అవుతోందని పిటిషనర్ ఆరోపించారు. వాస్తు పేరుతో భవనాలను కూల్చివేసి కొత్తవి కట్టాలనుకోవడం సరికాదని అది ప్రజాధనం దుబారా చేయడమేనాని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. కనుక సచివాలయం కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని పిటిషన్‌ కోరారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు, మంగళవారం దీనిపై విచారణ జరుపుతామని తెలిపింది. Related Post