తెలంగాణ పోలీసులకు శుభవార్త

June 24, 2019


img

తెలంగాణ పోలీసులకు, వారి కుటుంబ సభ్యులకు కూడా ఇది శుభవార్తే. రాష్ట్రంలో పోలీసులు అందరికీ వారాంతపు శలవు (వీక్లీ ఆఫ్) ఇవ్వాలని ఆదేశిస్తూ డిజిపి మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలలో పోలీస్ సిబ్బంది సంఖ్య, వారి డ్యూటీలను బట్టి సర్దుబాటు చేసి వారానికి ఒక రోజు శలవు ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీ, కమీషనర్లను డిజిపి ఎం. మహేందర్ రెడ్డి ఆదేశించారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడే సిఎం కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను అమలుచేస్తామని చెప్పారు. కేసిర్‌ ఆదేశాల మేరకు కొన్ని జిల్లాలలో దీనిని ప్రయోగాత్మకంగా అమలుచేసి చూశారు కూడా. కానీ పోలీస్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా పూర్తి స్థాయిలో అమలుచేయలేకపోతున్నారు. రాష్ట్రానికి 1,08,000 మంది పోలీసులు అవసరం ఉండగా ప్రస్తుతం అన్ని విభాగాలలో కలిపి కేవలం 54,000 మంది మాత్రమే ఉన్నారు. సుమారు ఏడాదిగా కొనసాగుతున్న పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తయితే త్వరలో మరో 18,500 మంది విధులలో చేరుతారు. అప్పుడు రాష్ట్ర పోలీసుల సంఖ్య 72,500కు చేరుకొంటుంది. కనుక పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వడంలో ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇవ్వాలని డిజిపి ఆదేశించడంతో అంతవరకు వేచి చూడకుండా వీలైనంత త్వరలోనే దీనిని అమలుచేయనున్నారు. ఇది అమలైతే తీవ్ర పని ఒత్తిడితో రేయింబవళ్లు పనిచేస్తున్న పోలీసులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. 


Related Post