జిల్లాకో తెరాస కార్యాలయం ముహూర్తం ఖరారు

June 22, 2019


img

ముందస్తు ఎన్నికలలో తెరాసకు ఊహించనివిధంగా కాంగ్రెస్ మిత్రపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవడంతో అవలీలగా గెలుస్తామనుకొన్న సీట్ల కోసం చాలా చెమటోడ్చవలసి వచ్చింది. ఆ తరువాత స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో.. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో కూడా తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కానీ మళ్ళీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో తెరాస క్లీన్ స్వీప్ చేసింది. ఈవిధంగా ఒక్కో ఎన్నికలకు ఒక్కో రకం ప్రజాతీర్పు రావడాన్ని తెరాస లైట్ తీసుకోకుండా ఒక హెచ్చరికగా స్వీకరించి, పార్టీని గ్రామస్థాయి నుంచి పటిష్టపరుచుకునేందుకు నడుం బిగించింది. ఆ ప్రయత్నాలలో భాగంగా ఈనెల 27 నుంచి 31వ తేదీలోగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని కేటీఆర్‌ సూచించారు.  ఈనెల 27వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు నెలరోజుల పాటు తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగబోతోంది. ఈసారి ప్రతీ ఇంటికీ ఒక్కరైనా తెరాసలో చేరేవిధంగా ప్రోత్సహించాలని సిఎం కేసీఆర్‌ తెరాస నేతలను కోరారు.  

అంతేకాదు... రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో తెరాస కార్యాలయ భవనాలు నిర్మించుకోవాలని సిఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఒక్కో భవనానికి ఎకరా స్థలం, రూ.60 లక్షలు చొప్పున కేటాయిస్తునట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వాటన్నిటికీ జూన్ 24న ఉదయం 10 నుంచి 11 గంటల లోపు శంఖుస్థాపన చేయాలని తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జిల్లా తెరాస నేతలను ఆదేశించారు. మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్లకు ఆ భాద్యతలను అప్పగించారు. స్థానిక ఎమ్మెల్యేలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఏడాది దసరానాటికల్లా నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్దం అయ్యేలా నిర్మాణపనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాలలో తెరాస కార్యాలయ భవనాలు ఒకే నమూనాతో ఉంటాయని వాటి డిజైన్ త్వరలో సిఎం కేసీఆర్‌ ఖరారు చేస్తారని కేటీఆర్‌ చెప్పారు.


Related Post