అధికారం కావాలా...అయితే మీట్ మిస్టర్ ప్రశాంత్ కిషోర్!

June 22, 2019


img

ఒకప్పుడు రాజకీయపార్టీలు ఆకర్షణీయమైన నినాదాలతో ఆచరణ సాధ్యం కానీ హామీలతో ఓటర్లను మభ్యపెట్టి అధికారంలోకి వస్తుండేవి. అవన్నీ నేటికీ ఉన్నాయి కానీ ప్రజలలో రాజకీయ చైతన్యం పెరిగిపోవడంతో వారిని ‘పడేయడం’ చాలా కష్టంగా మారిపోయింది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ ఇచ్చి కోరుకున్న వారందరికీ సులువుగా అధికారం సంపాదించిపెడుతున్నాడు. 

దశాబ్ధకాలంగా  అధికారం చేజిక్కించుకోవడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కానీ ప్రశాంత్ కిషోర్ చెయ్యి పడగానే ముఖ్యమంత్రి అయిపోయారు. అది చూసి తమిళనాడు లోక్‌సభ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన కమల్ హాసన్‌ కూడా ప్రశాంత్ కిషోర్‌ను ఆశ్రయించారు. చెన్నైలోని ఆళ్వార్ పేటలో గల తన పార్టీ కార్యాలయంలో ఇటీవల ప్రశాంత్ కిశోర్‌తో ఇదే విషయమై సుమారు రెండు గంటలపాటు చర్చించారు. ప్రశాంత్ కిషోర్‌ వద్ద గల మంత్రదండాన్ని తిప్పి 2021లో జరుగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో తన ఎంఎన్ఎం పార్టీని గెలిపించవలసిందిగా కమల్ హాసన్‌ కోరినట్లు సమాచారం. 

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీ తిరుగులేని అధికారం చలాయిస్తున్నప్పటికీ, ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 18 సీట్లు గెలుచుకొని ఆమెకు పెద్ద షాక్ ఇవ్వడంతో, ఎందుకైనా మంచిదని ఆమె కూడా ప్రశాంత్ కిషోర్‌ను ఆశ్రయించారు. కనుక సులువుగా అధికారం సంపాదించాలంటే, చేతిలో అంగబలం, అర్ధబలం, పదవి, అధికారం ఉంటే సరిపోవు…పక్కన ప్రశాంత్ కిషోర్ కూడా ఉండాలన్న మాట! 


Related Post