కమల్ తరువాత రజనీ సిద్దం

June 22, 2019


img

తమిళనాడులో జయలలిత, కరుణానిధి జీవించి ఉన్నంత వరకు అక్కడి రాజకీయాలు వారి చుట్టూ వారి రెండు పార్టీల చుట్టూనే తిరుగుతుండేవి. వాటి మద్యే అధికార మార్పిడి జరుగుతుండేది. కానీ వారిరువురి మరణంతో తమిళనాడులో రాజకీయశూన్యత ఏర్పడింది. అదే అదునుగా కాంగ్రెస్, బిజెపిలు ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి గట్టి ప్రయత్నాలు చేశాయి. 

తమిళనాడులో బిజెపి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పరుచుకోగలిగింది కానీ లోక్‌సభ ఎన్నికలలో విఫలం అయ్యింది. కాంగ్రెస్ పార్టీ డీఎంకెతో పొత్తు పెట్టుకొని లోక్‌సభ ఎన్నికలలో 8 సీట్లు గెలుచుకోగలిగింది కానీ అధికారం దాని చేతిలో లేదు. 

ఈ రాజకీయశూన్యతను చూసి ప్రముఖ నటుడు కమల్ హాసన్‌ కూడా ఎం.ఎన్.ఎం పార్టీ స్థాపించి పోటీ చేశారు కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయారు. రాష్ట్రమంతటా లక్షలాది మంది అభిమానులున్న ఆయనకు ఇది ఊహించని పెద్ద షాకే అని చెప్పవచ్చు. (ఏపీలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కూడా అటువంటి చేదు అనుభవమే ఎదురైంది. 

ప్రముఖ నటుడు రజనీకాంత్ ఇవన్నీ చూసి కూడా ఇంకా రాజకీయాలలోకి రావాలనుకొంటుండటం విశేషమే. అయితే ఆయన వచ్చేది ఇప్పుడు కాదు మరో రెండేళ్ళ తరువాత జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో వస్తారుట. అప్పుడు ఆయన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన సోదరుడు సత్యనారాయణ రావు శుక్రవారం మీడియాకు తెలిపారు. తమిళనాడు ప్రజలు సుపరిపాలన కోరుకొంటున్నారని, అది కేవలం రజనీకాంత్‌తోనే సాధ్యం అవుతుందని అన్నారు. 

రజనీకాంత్ రాజకీయాలలోకి రావాలనుకొంటున్నప్పుడు ఈవిధంగా కబుర్లతో కాలక్షేపం చేయడం ఎందుకు? కమల్ హాసన్‌లాగ పార్టీ పెట్టుకొని ప్రజలలోకి వచ్చి తన సత్తా ఏపాటిదో తేల్చుకోవచ్చు కదా? అని తమిళనాడు ప్రజలే అంటున్నారు. కానీ రజనీ రాజకీయరైలు ఎప్పుడూ లేటుగానే నడుస్తుంటుంది. అది ఎప్పటికైనా వస్తుందో లేదో కూడా తెలియదు.


Related Post