అమీర్‌పేట్‌-హైటెక్‌సిటీ రోడ్లు ట్రాఫిక్ జామ్

June 22, 2019


img

శుక్రవారం సాయంత్రం కురిసిన తొలకరి జల్లులతో హైదరాబాద్‌ నగరం చల్లబడింది కానీ ఆ వర్షానికి అమీర్‌పేట్‌ నుంచి -హైటెక్‌సిటీ వరకు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఐదారు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దాంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు బయలుదేరిన ఉద్యోగులు దానిలో చిక్కుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు.

బస్సులు, ఆటోలలో ప్రయాణిస్తున్నవారు సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్లకు చేరుకొని మెట్రో రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకొన్నారు. అనేకమంది ద్విచక్రవాహనదారులు తమ వాహనాలను రోడ్డు పక్కనే నిలిపివేసి వారు కూడా మెట్రోలో తమ గమ్యస్థానాలు చేరుకున్నారు. ఒకేసారి వేలమంది మెట్రోలోకి రావడంతో మెట్రో రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడిపోయాయి.

విశేషమేమిటంటే ప్రముఖ సినీ నటుడు నితిన్ కూడా ఈ ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకొన్నారు. దాంతో ఆయన కూడా సమీపంలో మెట్రో స్టేషన్ చేరుకొని కిటకిటలాడుతున్న మెట్రోరైల్లో ప్రయాణించి తన గమ్యం చేరుకున్నారు. తమ అభిమాన హీరో తమతో పాటు మెట్రో రైల్లో ప్రయాణిస్తుండటంతో ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు జనాలు ఎగబడటంతో రైల్లో కాసేపు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఎట్టకేలకు రాత్రి 10 గంటలకు ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యింది. 


Related Post