నేతలు బాగుపడ్డారు...పార్టీ పోయింది!

June 21, 2019


img

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలపై మళ్ళీ విమర్శలు గుప్పించారు. నిన్న హైదరాబాద్‌ పెద్ద అంబర్‌పేటలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తెలంగాణ ఇచ్చినందుకు రాష్ట్రంలో అధికారంలోకి రావలసిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర నాయకత్వలోపం...వారి తప్పుడు నిర్ణయాల వలన వరుసగా రెండుసార్లు ఎన్నికలలో ఓడిపోవడమే కాక పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందిప్పుడు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ముగ్గురూ ఉన్నంతకాలం పార్టీ కోలుకొనే అవకాశం లేదు. వారి ముగ్గురు వలననే నేడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలిగింది. కాంగ్రెస్ వలన నేతలు బాగుపడ్డారు కానీ పార్టీ నాశనం అయ్యింది.  

ఎన్నికల సమయంలో సరైన అభ్యర్ధులకు టికెట్లు కేటాయించకపోవడం, తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్దంగా చంద్రబాబునాయుడు (టిడిపి)తో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడం వంటి తప్పుడు నిర్ణయాలతో వారు ముగ్గురూ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు. కనీసం పార్టీ విడిచివెళ్లిపోతున్న వారిని కూడా కాపాడుకోలేకపోవడంతో ఇప్పుడు ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఏమి ప్రయోజనం? అనే ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోలుకోగలదని నేను అనుకోవడం లేదు. కానీ నియంతృత్వపాలన సాగిస్తున్న కేసీఆర్‌ను నిలువరించాలన్నా, గద్దె దించాలన్నా తెరాసకు బలమైన ప్రత్యామ్నాయం ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో బిజెపి మాత్రమే తెరాస ధాటిని తట్టుకొని నిలబడగలదనిపిస్తోంది. అందుకే నేను ఆ పార్టీలో చేరాలని భావిస్తున్నాను. నాతో ఎవరు వచ్చినా సంతోషమే. ఎవరూ రాకపోయినా అభ్యంతరం లేదు. కానీ నేను సరైన నిర్ణయం తీసుకున్నానని మున్ముందు అందరూ అంగీకరిస్తారు,” అని అన్నారు.


Related Post