నలుగురు ఎంపీలు బిజెపిలోకి జంప్

June 20, 2019


img

తెలంగాణలో టిడిపి దుకాణం బంద్‌ అయ్యి చాలా రోజులే అయ్యింది. ఇప్పుడు ఏపీలో కూడా బంద్‌ అయ్యే సమయం వచ్చినట్లుంది. గురువారం ఉదయం నలుగురు టిడిపి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టిజి వెంకటేష్, సిఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు బిజెపిలో చేరారు. వారు నలుగురికి ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెపి నడ్డా కాషాయకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారి చేరికతో ఏపీలో బిజెపి బలపడిందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తాము బిజెపిలో చేరామని సుజన చౌదరి చెప్పారు. తమను బిజెపిలో విలీనం చేయవలసిందిగా రాజ్యసభ ఛైర్మన్ ఎం. వెంకయ్యనాయుడికి వారు లేఖ కూడా ఇచ్చారు.  

టిడిపి ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించడానికి సిద్దంగా ఉన్నారని ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా శాసనసభలో చెప్పారు. అయితే వైసీపీలో చేరదలచుకున్నవారు తమ పదవులకు రాజీనామాలు చేసి రావలసి ఉంటుందని చెప్పడంతో వారు వెనక్కు తగ్గి ఉండవచ్చు లేకుంటే ఈపాటికి ఫిరాయింపులు మొదలైపోయుండేవేమో? కానీ ఏదో ఒకరోజు సిఎం జగన్ ఆ నిబందనను సడలిస్తే టిడిపి ఎమ్మెల్యేలు కూడా ఫిరాయించే అవకాశాలున్నాయి. 

ఇంతకాలం ఏపీలో టిడిపికి ఎదురేలేదన్నట్లు ఉండేది కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో టిడిపి ఘోరంగా ఓడిపోవడం, చంద్రబాబునాయుడుకు అన్ని వైపులా శత్రువులు చుట్టుముట్టడం, కేంద్రంలో మళ్ళీ నరేంద్రమోడీ అధికారంలోకి రావడం వంటి పరిణామాలతో ఒక్కసారిగా టిడిపి పరిస్థితి తలక్రిందులయింది. ఒకవేళ ఎమ్మెల్యేల ఫిరాయింపులు కూడా మొదలైతే అప్పుడు ఏపీలో కూడా టిడిపి ఉనికి ప్రశ్నార్ధకంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post