కాంగ్రెస్‌ నేతలకు సుమన్ హితబోధ

June 19, 2019


img

తెలంగాణ ప్రజల నీటి కష్టాలను శాశ్వితంగా తీర్చబోయే కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభోత్సవం కానుంది. కనుక రాష్ట్రంలో ఉన్నవారే కాకుండా దేశవిదేశాలలో ఉన్న తెలంగాణ ప్రజలు కూడా చాలా సంతోషిస్తున్నారు. గతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం అంటే ఏళ్ళు లేదా దశాబ్ధాలపాటు సాగే పని అనే భావన నెలకొని ఉండేది. కానీ కేవలం మూడేళ్ళలో ఇంత భారీ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి చూపించడంతో సిఎం కేసీఆర్‌, తెరాస సర్కారుపై సర్వత్రా ప్రశంశల వర్షం కురుస్తోంది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌, బిజెపి నేతలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. వాటిపై తెరాస ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఘాటుగా స్పందించారు. 

“గతంలో కాంగ్రెస్‌ హయాంలో ప్రాజెక్టులంటే ఎప్పటికీ ‘పెండింగ్’ అన్నట్లు సాగేవి కానీ మా ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులన్నీ ‘రన్నింగ్’ అన్నట్లు యుద్ధప్రాతిపదికన పూర్తవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర, మద్య తెలంగాణ ప్రాంతాలకు త్రాగునీరు, 45 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటిని, హైదరాబాద్‌ నగరానికి త్రాగునీటిని అందించబోతున్న గొప్ప ప్రాజెక్టు. దానిని చూసి రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సంతోషిస్తుంటే, కాంగ్రెస్‌, బిజెపి నేతలు మాత్రం కడుపుమంటతో రగిలిపోతూ నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారు. వారికి ఒకటే మనవి. ఇకనైనా ‘ప్రభుత్వం ఏమి చేసినా వ్యతిరేకించాలనే’ మీ మూస రాజకీయాలకు స్వస్తి చెప్పి కాస్త నిర్మాణాత్మకంగా, కాస్త సానుకూలంగా వ్యవహరించడం నేర్చుకొంటే మంచిది లేకుంటే ప్రజల దృష్టిలో మీరే చులకనవుతారు. 

మన చుట్టుపక్కల రాష్ట్రాలకు వాటి పొరుగు రాష్ట్రాలతో ఏళ్ళ తరబడి జలవివాదాలు కొనసాగుతున్నాయి కానీ మా ప్రభుత్వం మాత్రం ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకొంటూ శరవేగంగా ప్రాజెక్టులను నిర్మిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. మరి అందుకు మా ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలా లేక విమర్శించాలా? మీరే ఆలోచించుకోండి. యావత్ తెలంగాణ ప్రజలు ఒక పండగలాగ భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నవ్వులపాలు కావద్దని ప్రతిపక్ష నేతలకు నా మనవి,” అని బాల్కా సుమన్ అన్నారు.   

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు, జగన్‌మోహన్‌రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్, గవర్నర్‌ నరసింహన్‌, ఈ ప్రాజెక్టుకు రుణాలను అందించిన బ్యాంకర్లు హాజరవుతున్నారు. ఈనెల 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు మేడిగడ్డ వద్ద వేదపండితులు హోమం చేస్తారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌ చేతుల మీదుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది.


Related Post