సచివాలయ నిర్మాణంపై రాములమ్మ కామెంట్స్

June 19, 2019


img

కేంద్రప్రభుత్వం బైసన్ పోలో మైదానం ఇవ్వకపోవడంతో ప్రస్తుత సచివాలయం ఉన్న ప్రదేశంలోనే సుమారు రూ.400 కోట్లు వ్యయంతో కొత్త సచివాలయం నిర్మించబోతున్నామని సిఎం కేసీఆర్‌ నిన్న తెలిపారు. దీనిపై కాంగ్రెస్‌ సీనియర్ నేత విజయశాంతి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ భిన్నంగా స్పందించారు. 

విజయశాంతి స్పందిస్తూ, “ఇప్పటి వరకు బైసన్ పోలో మైదానంలోనే కొత్త సచివాలయం నిర్మిస్తానని చెపుతూ వచ్చిన సిఎం కేసీఆర్‌ ఇప్పుడు హటాత్తుగా పాత సచివాలయం ఉన్నచోటే నిర్మిస్తానని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కేంద్రప్రభుత్వం బైసన్ పోలో మైదానం ఇవ్వనందునే ఈ నిర్ణయం తీసుకున్నామని సిఎం కేసీఆర్‌ చెపుతుండటం ఇంకా ఆశ్చర్యంగా ఉంది. తెరాస ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా బైసన్ పోలో మైదానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి కేంద్రప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. కానీ బైసన్ పోలో మైదానంలో సచివాలయ నిర్మాణ ఆలోచన చేసినప్పటి నుంచి తెరాసకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయనే భయంతోనే కేసీఆర్‌ ఆ ప్రతిపాదన విరమించుకొన్నారని తెరాస నేతల ద్వారా నాకు తెలిసి చాలా ఆశ్చర్యపోయాను,” అని అన్నారు. 

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పందిస్తూ, “ఉన్న సచివాలయాన్ని కూల్చివేసి మరొకటి కట్టాలని, ఎంతో చరిత్ర ఉన్న శాసనసభ, మండలి ఉండగా మళ్ళీ కొత్తవి కట్టాలని సిఎం కేసీఆర్‌ ఎందుకు ఆలోచిస్తున్నారో అర్ధం కాదు. ప్రస్తుతం ఉన్న సచివాలయం, శాసనసభ, మండలి భవనాలు అన్నీ చాలా ధృడంగా, సౌకర్యవంతంగానే ఉన్నాయి. కనుక కొత్త భవనాల నిర్మాణాలను మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ డబ్బును రైతులు, విద్యార్ధుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తే మంచిది,” అని అన్నారు.


Related Post