జెపి నడ్డా అందుకే హైదరాబాద్‌ వస్తున్నారా?

June 19, 2019


img

రాష్ట్రంలో బిజెపి పతనం గ్రేటర్ ఎన్నికలతోనే మొదలైందని అందరికీ తెలుసు. అది అసెంబ్లీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకు కొనసాగింది. లోక్‌సభ ఎన్నికలతో రాష్ట్రంలో బిజెపి మళ్ళీ పుంజుకోగలిగింది. కనుక త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో తమ సత్తాను చాటుకుని, రాష్ట్రంలో తమ బలాన్ని పెంచుకోవాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. జూలై 6నుంచి రాష్ట్రంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలవుతుందని, అప్పటి నుంచే పార్టీలో బారీగా చేరికలు కూడా మొదలవుతాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ చెప్పారు.

బిజెపి జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులైన జెపి నడ్డా బహుశః ఇదే పనిమీద ఈ నెలాఖరులోగా హైదరాబాద్‌ పర్యటనకు రానున్నారని సమాచారం. ఆయన హైదరాబాద్‌ వచ్చినప్పుడే ఇతర పార్టీల నేతలను బిజెపిలోకి చేర్చుకునే ప్రయత్నాలు జరుగవచ్చని సమాచారం. మున్సిపల్ ఎన్నికలకు ముందుగానే ఈ వలసల కార్యక్రమం పూర్తి చేయగలిగినట్లయితే బిజెపి బలం పెరుగుతుంది కనుక ఎన్నికలలో విజయావకాశాలు మెరుగవుతాయని బిజెపి నేతలు భావిస్తున్నారు. 

ముఖ్యంగా గత గ్రేటర్ ఎన్నికలలో ఓటమితో రాజధాని నగరంపై పట్టుకోల్పోయిన బిజెపి ఈసారి ఎన్నికలలో గెలిచి మళ్ళీ పట్టుసాధించాలని భావిస్తోంది. తెరాసను డ్డీకొని ఓడించడం సాధ్యమా కాదా అనే విషయం పక్కన పెడితే ఈసారి గ్రేటర్ ఎన్నికలలో తెరాసకు కాంగ్రెస్, బిజెపిలు రెండూ గట్టి సవాలు విసిరే అవకాశం కనిపిస్తోంది. ఈ సంగతి సిఎం కేసీఆర్‌ కూడా చాలా ముందే గ్రహించినందునే కేటీఆర్‌ను ఇంకా మంత్రివర్గంలోకి తీసుకోకుండా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించి ఉంటారు. కనుక మున్సిపల్ ఎన్నికలు కూడా పూర్తయిన తరువాతే మంత్రివర్గ విస్తరణ చేస్తారేమో? 


Related Post