కొత్త సచివాలయం నిర్మిస్తాం: కేసీఆర్‌

June 18, 2019


img

మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశంలో సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “ఈరోజు మంత్రివర్గ సమావేశంలో కొత్త సచివాలయం నిర్మాణం గురించి చర్చించాము. సచివాలయంలో ఏపీ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాల అప్పగింత దాదాపు పూర్తయిపోయింది. నేటికీ కేంద్రప్రభుత్వం బైసన్ పోలో మైదానం మనకు అప్పగించలేదు కనుక పాత సచివాలయం ఉన్న చోటే కొత్త సచివాలయాన్ని నిర్మించాలని నిర్ణయించాము. సుమారు 5-6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునికంగా ఆహ్లాదకరంగా ఉండే కొత్త సచివాలయాన్ని నిర్మించుకోవడానికి రూ.400 కోట్లకు మించి ఖర్చు అవ్వదు. ప్రస్తుత సచివాలయంలో కొన్ని పాతవి, కొన్ని కొత్తవి, మరికొన్ని 2-3 దశాబ్ధాల క్రితం నిర్మించినవి ఉన్నాయి. కనుక వాటిని అన్నిటినీ కూలగొట్టి వాటి స్థానంలో కొత్త సచివాలయం నిర్మించుకోవాలా లేదా వాటిలో ఉపయోగకరంగా ఉన్నవాటిని ఉంచుకొని మిగిలినవి కూలగొట్టి కొత్త సచివాలయం నిర్మించుకోవాలా? అనే విషయంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాము. ఆ కమిటీ నివేదిక మేరకు తుది నిర్ణయం తీసుకుంటాము.  

నగరం నడిబొడ్డున ఎర్రమంజిల్ వద్ద 17 ఎకరాల సువిశాలమైన భూమి ఉంది. అక్కడ కొత్త శాసనసభ, మండలి, సెంట్రల్ హాల్ నిర్మించాలని నిర్ణయించాము. అయితే ప్రస్తుత శాసనసభ భవనం మన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని చాటి చెప్పేవిధంగా ఉంది కనుక కొత్త శాసనసభ భవనం కూడా బయటవైపు (ఎలివేషన్) అదే రూపంగా నిర్మించి, లోపల మనకు కావలసినట్లు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించుకోవాలని నిర్ణయించాము. ఈ భవన నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశాము.  

ఈ నెల దాటితే మళ్ళీ దసరా వరకు మంచి ముహూర్తలు లేవని పండితులు చెప్పారు. కనుక ఈ నెల 27వ తేదీన కొత్త సచివాలయానికి భూమి పూజ చేయాలని నిర్ణయించాము,” అని కేసీఆర్‌ చెప్పారు. 


Related Post