కోర్టులు, కేంద్రం జోక్యం లేకుండా సాగుతాం: కేసీఆర్‌

June 18, 2019


img

సిఎం కేసీఆర్‌ కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఈరోజు మంత్రివర్గంలో చర్చించిన అంశాలు, ఇంకా అనేక ఇతర విషయాల గురించి మీడియాకు వివరించారు. 

ఏపీ-తెలంగాణ సంబంధాల పునరుద్దరణ గురించి మాట్లాడుతూ, మేమెప్పుడూ ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సఖ్యతతోనే ఉండాలని కోరుకొంటాము. అయితే ఏపీలో గత ప్రభుత్వం వివాదస్పదంగా వ్యవహరిస్తుండటం వలన ఇరు రాష్ట్రాల మద్య సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారి, కొత్త సిఎం జగన్‌మోహన్‌రెడ్డి మనతో స్నేహపూర్వకంగా ఉంటున్నందున, ఇకపై కోర్టులు, కేంద్రప్రభుత్వం వద్దకు పోకుండా పరస్పరం చర్చించుకొని అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొందామని నిర్ణయించాము. 

కృష్ణా, గోదావరి నదులలో సుమారు 5000 టీఎంసీలు నీళ్ళు ఉంటాయి. వాటిలో రెండు రాష్ట్రాలు కలిపినా 2-3000 టీఎంసీలు నీళ్ళు కూడా వాడుకోలేకపోవడం చేత మిగిలిన నీళ్ళన్నీ వృధాగా సముద్రంలో కలిసిపోతున్నాయి. మనకు అవసరమైన దానికంటే ఎక్కువే నీళ్లున్నాయి కనుక నదీజలాల కోసం కీచులాడుకోవలసిన అవసరం లేదు. రాబోయే రెండు మూడేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రతీ అంగుళం భూమికి నీరు అందించేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించాలని నేను, ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించుకున్నాము. 

అలాగే విభజన సమస్యలను కూడా సామరస్యంగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని నిర్ణయించాము. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొంటూ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నాము. మళ్ళీ చాలా కాలం తరువాత రెండు రాష్ట్రాల మద్య ఇటువంటి సహృద్భావ వాతావరణం ఏర్పడటం చాలా శుభపరిణామంగా భావిస్తున్నాను,” అని సిఎం కేసీఆర్‌ అన్నారు.


Related Post