ఏపీ పోలీసులకు వారానికి ఒక రోజు శలవు

June 18, 2019


img

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్ర, ఎన్నికల సందర్భంగా ప్రజలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఒకటొకటిగా అమలుచేస్తున్నారు. వాటిలో ఒకటైన పోలీసులకు వారాంతపు శలవును ప్రయోగాత్మకంగా మొదట విశాఖపట్నంలో అమలుచేసి చూస్తోంది ఏపీ పోలీస్ శాఖ. పోలీసులకు వారు నిర్వహిస్తున్న విధులను బట్టి రోజుకు కొంతమంది చొప్పున వారాంతపు శలవులు సర్దుబాటు చేశారు. ఈ ప్రయోగంలో ఎటువంటి సమస్యలు తలెత్తకపోవడంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయడానికి పోలీస్ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 

రాష్ట్ర హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎం.సుచరిత ఆదివారం ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర విభజన తరువాత జనాభా ప్రాతిపదికన ఏపీలో మరో నాలుగు బెటాలియన్ల పోలీసులను నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే నాలుగు బెటాలియన్లను ఏర్పాటు చేస్తాము. వాటిలో ఒకటి మహిళా బెటాలియన్, మరొకటి గిరిజన బెటాలియన్ ఉండేవిధంగా ఏర్పాటు చేస్తాము. నాలుగు బెటాలియన్ల ఏర్పాటుకు త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్‌ జారీ చేస్తాము,” అని చెప్పారు. సాధారణంగా ఒక బెటాలియన్‌లో 500-800 మంది వరకు పోలీసులు ఉంటారు. కనుక నాలుగు బెటాలియన్లకు కలిపి 2,000-3,200 మందికి ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. 


Related Post