పుల్వామాలో మళ్ళీ ఉగ్రదాడి

June 18, 2019


img

ఈ ఏడాది ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత్‌ జవాన్లు మృతి చెందినప్పుడు భారత్‌-పాక్‌ల మద్య దాదాపు యుద్ద వాతావారణం నెలకొంది. కానీ ప్రపంచదేశాల ఒత్తిడితో రెండు దేశాలు వెనక్కు తగ్గడంతో యుద్ధం ముప్పు తప్పిపోయింది. నాటి పుల్వామా ఉగ్రదాడి, తదనంతర పరిణామాలు ఇంకా కళ్ళలో మెదులుతూనే ఉన్నాయి.

సోమవారం మధ్యాహ్నం మళ్ళీ పుల్వామాలో ఉగ్రవాదులు భారత జవాన్లు, అధికారులను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న వాహనాలను శక్తివంతమైన బాంబులతో పేల్చివేసేందుకు ప్రయత్నించారు. వారు ప్రయాణిస్తున్న వాహనం బుల్లెట్ ప్రూఫ్, మైన్ ప్రూఫ్ అయినందున ఆ భారీ ప్రేలుడు ధాటికి వాహనం దెబ్బతింది. ఈ దాడిలో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిరువురూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రేలుడులో 9 మంది జవాన్లు, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. గాయపడినవారిని శ్రీనగర్‌లోని 92, బేస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.   

గతంలో పుల్వామాలో దాడి జరిగిన ప్రాంతానికి 27 కిమీ దూరంలో గల అరిహల్ అనే ప్రాంతంలో లస్సిపురా రోడ్డుపై నిన్న ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకోలేదు కానీ ప్రేలుడుకు ఉపయోగించిన శక్తివంతమైన ప్రేలుడు పదార్ధాలను, వాటిని ప్రయోగించిన తీరును బట్టి ఇది కూడా జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పనే అయ్యుండవచ్చని అధికారులు భావిస్తున్నారు. 

భారత్‌-పాకిస్తాన్ మళ్ళీ శాంతిచర్చలు జరపాలని పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్‌ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ వ్రాసిన కొద్ది రోజులకే ఈ ఘటన జరుగడంతో పరిస్థితులు మళ్ళీ మొదటికొచ్చినట్లయింది. ఈసారి ఈ దాడిపై మోడీ ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తుందో చూడాలి.


Related Post