తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

June 17, 2019


img

ఆదివాసీలకు పునరావాసం కల్పించకుండా వారి భూములు, ఇళ్ళ నుంచి బలవంతంగా ఖాళీ చేయించి, అటవీశాఖ గోదాములో వారిని ఉంచినందుకు హైకోర్టు ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొమురం భీమ్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొలంగొండి గ్రామానికి చెందిన ఆదివాసీల తరపున దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై ధర్మాసనం వెంటనే స్పందిస్తూ 67 మంది నిర్వాసిత ఆదివాసీ కుటుంబాలను తమ ముందు హాజరుపరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో, అధికారులు వారినందరినీ బస్సులో హైకోర్టుకు తీసుకువచ్చారు. 

వారి తరపున ఇద్దరు పెద్దలు చెప్పిందంతా ఓపికగా విన్న హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారందరికీ తక్షణమే వాకెండీలోని ప్రభుత్వ వసతిగృహంలో వసతి కల్పించి, అన్ని సదుపాయాలు సమకూర్చాలని ఆదేశించింది. ఆరు నెలలోగా వారందరికీ భూములు కేటాయించాలని, వాటిలో ప్రభుత్వమే బోర్లు కూడా వేయించాలని ఆదేశించింది. ఏడాదిలోగా వారందరికీ పక్కా ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఆదేశించింది. వారి పాడిపశువులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది. వారికి ఇళ్ళు, పొలాలు, వాటిలో బోర్లు, పాడిపశువులు అన్ని సమకూర్చేవరకు అందరినీ ప్రభుత్వ వసతి గృహంలోనే ఉంచి వారికి అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహన్‌, జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన  హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.       



Related Post