రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం

June 17, 2019


img

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వంపై మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన విమర్శలు, ఆరోపణలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియాల వలననే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి కలిగింది. రాష్ట్రంలో ఇక పార్టీ మనుగడ సాగించలేదు. రాష్ట్రంలో బిజెపి మాత్రమే తెరాసకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని,” అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. త్వరలోనే తాను బిజెపిలో చేరబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు కూడా. 

ఆయన చేసిన వ్యాఖ్యలపై ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క, సీనియర్ నేత మల్లు రవి తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీతక్క మీడియాతో మాట్లాడుతూ, “కోమటిరెడ్డి సోదరులపై నాకు చాలా అభిమానం, గౌరవం ఉంది. కానీ ఇంతకాలం పార్టీలో పదవులు అనుభవించి, ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలబడకుండా ఇంకా నష్టం కలిగించేలా, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీసేలా రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం నాకు చాలా బాధ కలిగించింది. పార్టీలో సమస్యలున్నాయని భావిస్తే పార్టీ అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప ఈవిధంగా బహిర్గతంగా మాట్లాడటం సరికాదు. మనల్ని మనం తగ్గించుకునేలా మాట్లాడటం సరికాదు. ఇది మనింటికి మనమే నిప్పు పెట్టుకున్నట్లుంది. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లిపోదామనే ట్రెండ్ నడుస్తోంది. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే, కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనే ప్రయత్నం చేయకుండా, పార్టీకి నష్టం కలిగించేవిధంగా ఎవరూ వ్యవహరించకూడదు. రాష్ట్రంలో ఏమాత్రం బలం లేని బిజెపి ఒక్క ఎంపీ సీటు నుంచి నాలుగు ఎంపీ సీట్లకు ఎదిగింది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఎంతో బలమైన క్యాడర్ ఉంది. బలమైన నేతలున్నారు. ఓటు బ్యాంకు ఉంది. మరి మనమెందుకు భయపడాలి? అని ఆలోచించాలి తప్ప  మనం కూడా పార్టీకి జరుగుతున్న నష్టంలో భాగస్వాములు కావాలనుకోవడం సరికాదు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పునర్వైభవం సాధించడం పెద్ద కష్టం కాదు,” అని సీతక్క అన్నారు.  

ఈరోజు కాంగ్రెస్‌ క్రమశిక్షణ సంఘం గాంధీభవన్‌లో సమావేశమయ్యి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చించి ఆయనకు షో కాజ్ నోటీస్ ఇవ్వబోతున్నట్లు తాజా సమాచారం. 


Related Post