కొత్త సచివాలయానికి మళ్ళీ కొత్త డిజైన్

June 15, 2019


img

ప్రస్తుతం సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం నిర్మించాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే గతంలో బైసన్ పోలో మైదానంలో నిర్మించతలపెట్టిన సచివాలయానికి గీయించిన డిజైన్, దీనికి సరిపోదు కనుక మళ్ళీ కొత్తగా డిజైన్ గీయించవలసి వస్తోంది. దీనికోసం ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబందించి అధికారిక ఉత్తర్వులు ఈ నెలాఖరులోగా జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. 

ప్రస్తుత సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధీనంలో ఉన్న భవనాలను ఈనెల 19వ తేదీలోగా తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించడానికి చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నందున, సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాలను కూడా అక్కడి నుంచి వేరే చోటికి తరలించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నెల 26 లేదా 27వ తేదీలలో సిఎం కేసీఆర్‌ కొత్త సచివాలయభవన నిర్మాణానికి శంఖుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది దసరా పండుగలోగా పాత సచివాలయ భవనాలను కూల్చి వేసి, కొత్త సచివాలయ నిర్మాణపనులు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.


Related Post