రాష్ట్రంలో పోలిటికల్ మాఫియా: భట్టి

June 14, 2019


img

ఒకప్పుడు మాఫియా అంటే మనం ఎన్నడూ చూడని ఓ పెద్ద రౌడీగ్యాంగ్ అని భావించేవారం. ఆ తరువాత మెల్లగా ఇసుక మాఫియా, నకిలీ విత్తనాల మాఫియా, మత్తు మందుల మాఫియా, మద్యం మాఫియా...ఇలా రకరకాల మాఫియాలు పుట్టుకొచ్చాయి. తాజాగా ‘పొలిటికల్ మాఫియా’ అనే పదాన్ని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ప్రయోగించారు. 

గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో పొలిటికల్ మాఫియా, పోలిటికల్ టెర్రరిస్టులు పుట్టుకొచ్చారు. వారు ప్రజాస్వామ్యాన్ని ఆక్రమిస్తున్నారు. పుట్టలో పాములా ప్రగతి భవన్‌లో దాకొన్న సిఎం కేసీఆర్‌ ఆ పోలిటికల్ మాఫియాను నడిపిస్తున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బేరసారాలకు ప్రగతి భవన్‌ కేంద్రంగా మారింది. అక్కడే వారికి ఆయన అన్నీ నూరిపోసి వారిచేత మాట్లాడిస్తున్నారు. పుట్టలో దాగిన సిఎం కేసీఆర్‌ను ఏవిధంగా బయటకు రప్పించాలో మాకు బాగా తెలుసు. ఆయనకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలలో వారిని గెలిపించుకొని చూపాలని సవాల్ విసురుతున్నాను. కనీసం ఈ అంశంపై నాతో బహిరంగ చర్చకు రాగలరా? అని సవాలు చేస్తున్నాను. 

రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం సరిగాలేదని ఇప్పుడు విమర్శలు చేస్తున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎన్నికల సమయంలో టికెట్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టూ ఎందుకు తిరిగారు? ఎందుకు కాంగ్రెస్‌ టికెట్ తీసుకున్నారు? అప్పుడే పార్టీని వీడొచ్చు కదా? కాంగ్రెస్‌ పేరు చెప్పుకొని ఎన్నికలలో గెలిచి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే నిందిస్తున్నారు. అభివృద్ధి కోసమే తెరాసలో చేరామని ఫిరాయింపు ఎమ్మెల్యేలు చెప్పడం చూస్తే, ఇతర పార్టీల ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి కేసీఆర్‌ ప్రభుత్వం నిధులు విడుదల చేయదనుకోవాలా?అవసరమైతే రాజీనామా చేసి ఎన్నికలలో పోటీ చేస్తామని చెప్పడం కాదు...తక్షణమే రాజీనామాలు చేసి ఉప ఎన్నికలలో మీ సత్తా ఏమిటో చూపించండి...మేము కూడా చూస్తాం,” అని అన్నారు. 

ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ, “వాటి వలన కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే నష్టం కలుగుతుందని ప్రజలు భావిస్తే అది చాలా తప్పు. శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రజాస్వామ్యం కనబడకుండా పోతుంది. ఫిరాయింపులతో ప్రజల ఓటు హక్కుకు అర్ధం లేకుండా పోతుంది. ఈ తీరు ఇలాగే కొనసాగితే, మున్ముందు డబ్బున్నవాళ్ళు ఎమ్మెల్యేలను కొనుకొని ముఖ్యమంత్రి పదవి సంపాదించుకొనే పరిస్థితులు దాపురిస్తాయి. కనుక ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న సిఎం కేసీఆర్‌ వైఖరిని మేధావులు, ప్రజలు కూడా నిరసించాలి. త్వరలోనే వివిద వర్గాల మేధావులతో ఈ ఫిరాయింపుల వ్యవహారంపై రౌండ్ టేబిల్ సమావేశం నిర్వహించి సిఎం కేసీఆర్‌ వైఖరిని ఎండగతాము,” అని మల్లు భట్టివిక్రమార్క అన్నారు.


Related Post