తెలంగాణలో ఆపరేషన్ కమల్ షురూ?

June 14, 2019


img

loవచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో బలపడి తెరాసను డ్డీకొనాలని భావిస్తున్న బిజెపి అప్పుడే ఆ దిశలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్‌లో హయాత్ హోటల్లో మకాం వేసి కాంగ్రెస్‌, టిడిపి, తెరాసలో అసంతృప్త నేతలతో మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. 

అందరికంటే ముందుగా, తెరాసలో పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జి వివేక్, ఆయన సోదరుడు జి వినోద్ ఇద్దరినీ బిజెపిలోకి రప్పించేందుకు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆయనకు తెరాస టికెట్ నిరాకరించినప్పుడే, బిజెపి పెద్దపల్లి టికెట్ ఇవ్వడానికి సిద్దపడింది కానీ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘోరంగా ఓడిపోవడంతో, లోక్‌సభ ఎన్నికలలో కూడా బిజెపి ఓటమి ఖాయం అనే ఆలోచనతో బిజెపి ఆఫర్‌ను వివేక్ అప్పుడు తిరస్కరించారు. కానీ ఆయన అంచనాలకు భిన్నంగా రాష్ట్రంలో బిజెపి నాలుగు సీట్లు గెలుచుకోవడంతో వివేక్ పునరాలోచనలో పడ్డారు. కేంద్రంలో కూడా బిజెపి అధికారంలో ఉంది కనుక ఇప్పుడు బిజెపిలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. 

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలతో రాంమాధవ్ మంతనాలు సాగిస్తున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవి నిజమా కాదా? నిజమైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలలో ఆ ఇద్దరు ఎవరు?అనే ప్రశ్నలకు త్వరలో సమాధానం లభించవచ్చు. 

ఇంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సిఎం కేసీఆర్‌ బందువు రేగులపాటి రమ్యారావు ఇటీవల పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరేందుకు సిద్దం అవుతున్నారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తో కలిసి ఆమె బుదవారం హైదరాబాద్‌ రాంమాధవ్‌ను కలిశారు. త్వరలోనే తాను బిజెపిలో చేరబోతున్నట్లు ఆమె ప్రకటించారు. టిడిపి సీనియర్ నేతలలో ఒకరైన ఇనుగాల పెద్దిరెడ్డితో సహా మరికొందరు టిడిపి నేతలు త్వరలో బిజెపిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తాజా సమాచారం. 

వీరి చేరికలు పూర్తయ్యేలోగానే కరీంనగర్‌లో కొందరు కాంగ్రెస్‌ నేతలను బిజెపిలోకి రప్పించేందుకు ఆ పార్టీ నేతలు మంతనాలు ప్రారంభించినట్లు సమాచారం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ కమల్ మొదలైందని స్పష్టం అవుతోంది. దీనిపై కాంగ్రెస్‌, తెరాసలు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.


Related Post