ఉత్తమ్ వలననే పార్టీకి ఈ దుస్థితి: రేగ

June 12, 2019


img

పన్నెండు మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో పిటిషన్‌ వేయడంతో, వారందరికీ హైకోర్టు మంగళవారం నోటీసులు పంపించింది. దీనిపై తమ స్పందన తెలియజేసేందుకు వారందరూ బుదవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. 

ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు, నాయకత్వలోపం నెలకొని ఉన్నాయి. ఆ కారణంగానే 2014 నుంచి జరిగిన అన్ని ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటమి పాలవుతోంది. కానీ నేటికీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీరు మారలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆగమ్యగోచరంగా కనిపిస్తోంది. అందుకే మేమందరం కాంగ్రెస్‌ను వీడి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నాము. ఇది రాజ్యాంగం మాకు కల్పించిన హక్కు. కానీ మేము పదవులు లేదా వేరే ప్రయోజనాలు ఆశించి తెరాసలో చేరామని కాంగ్రెస్‌ నేతలు మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇకపై వారు తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తే వారిపై పరువునష్టం దావా వేయడానికి వెనకాడబోము. మేమందరం మా సొంత బలంతోనే గెలిచాము తప్ప కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నందున కాదు. కనుక అవసరమైతే మా పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ ఉప ఎన్నికలలో తెరాస తరపున పోటీ చేసి గెలిచి మా సత్తాను చాటుకొంటాము,” అని అన్నారు.

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ పార్టీ వరుస ఓటములు పాలవుతున్నా నిజాయితీగా ఆత్మవిమర్శ చేసుకొని లోపాలు సవరించుకొనే ప్రయత్నాలు చేయకుండా ఒకసారి ఈవీఎంలను, మరోసారి అధికార పార్టీని నిందిస్తూ కాంగ్రెస్ పార్టీ కాలక్షేపం చేసింది. పార్టీలో నుంచి వరుసగా నేతలు బయటకు వెళ్ళిపోతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమాత్రం చలించలేదు. అందుకే నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ. దానిలో కొనసాగాలని ఎవరూ కోరుకోరు. మాపై ఎవరు అనవసరంగా ఆరోపణలు చేసీనా చూస్తూ  ఊరుకోము. కోర్టుకు ఈడుస్తాము. కాంగ్రెస్‌ నేతలు వాదిస్తున్నట్లు మేము ఒకరొకరిగా తెరాసలో చేరలేదు. అందరూ కలిసి ఒకేసారి తెరాసలో విలీనం అయ్యాము. కనుక ఫిరాయింపుల చట్టం మాకు వర్తించదు,” అని అన్నారు.


Related Post