కేసీఆర్‌ కుటుంబం నేడు తిరుమల శ్రీవారి దర్శనం

May 27, 2019


img

తెలంగాణ సిఎంగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి ఆదివారం సాయంత్రం తిరుమల చేరుకొన్నారు. సిఎం కేసీఆర్‌తో పాటు ఆయన అర్ధాంగి శోభారాణి, కోడలు శైలిమ, మనుమడు హిమాన్శు తదితరులు కూడా వచ్చారు. వారికి జిల్లా కలెక్టర్, ఆలయ అధికారులు, పూజారులు, స్థానిక వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. వారందరూ నిన్న సాయంత్రం తిరుమల శ్రీవారి పాదాలను, శిలాతోరణాన్ని సందర్శించారు. ఆ తరువాత తిరుమల శ్రీకృష్ణా అతిధిగృహంలో బస చేసారు. ఈరోజు ఉదయం శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేస్తారు. శ్రీవారి దర్శనానంతరం కేసీఆర్‌ కుటుంబం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని హైదరాబాద్‌ తిరిగి బయలుదేరుతారు. 

ఈనెల 30వ తేదీన జగన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు 29 సాయంత్రం సిఎం కేసీఆర్‌ విజయవాడ చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. మరుసటిరోజు ఉదయం కనకదుర్గమ్మని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు స్థానిక ఇందిరాగాందీ మున్సిపల్ స్టేడియంలో జరుగబోయే జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతారు. 


Related Post