నిరంకుశత్వం చెల్లదు: కోదండరాం

May 25, 2019


img

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం స్పందించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ నిరంకుశత్వాన్ని ప్రజలు ఇక ఎంతమాత్రం సహించబోరని లోక్‌సభ ఫలితాలతో స్పష్టం చేశారు. తాను ఏమి చేసినా ఏమి చెప్పినా ప్రజలు అంగీకరిస్తారనుకొంటున్న సిఎం కేసీఆర్‌కు ప్రజలు తగినవిధంగా బుద్ధి చెప్పారు. తెరాసలో ముఖ్యమైన నేతలు ఇద్దరూ లోక్‌సభ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయారు. 

కేసీఆర్‌ మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పటికీ వెంటనే మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడం, ఆ కారణంగా రాష్ట్రంలో పాలన కుంటుపడటం, అయినప్పటికీ ఆయన ప్రభుత్వాన్ని, పాలనను, ప్రజలను గాలికొదిలి ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో పర్యటనలు చేయడం, రైతుల సమస్యలను రాజకీయాలుగా వర్ణించి వారి గోడు పట్టించుకోకపోవడం ఇలా...లోక్‌సభ ఎన్నికలలో తెరాస పేలవ ప్రదర్శనకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. రైతులకు ఆగ్రహం కలిగిస్తే ఏమవుతుందో నిజామాబాద్‌లో చూపారు. 

ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారం కోసం పోరాడేవారి  గొంతు వినిపించనీయకుండా చేయాలనే కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించవు. పోలీసులతో ప్రజాఉద్యమాలను అణచివేయలేరని గ్రహించాలి. గత 5 ఏళ్ళలో ఉద్యోగాలు భర్తీ చేయని కేసీఆర్‌ మళ్ళీ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలోని నిరుద్యోగులలో భయాందోళనలు పెరిగాయి. ఇకనైనా తెరాస సర్కారు తన వైఖరి, విధానాలు మార్చుకొని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగించాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు.


Related Post