మా అన్న బంగారు నాణెం

May 25, 2019


img

కోమటిరెడ్డి సోదరులకు నల్గొండ జిల్లా కంచుకోట వంటిది కానీ అసెంబ్లీ ఎన్నికలలో ఆ కంచుకోటను తెరాస బద్దలు గొట్టడమే కాకుండా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఓడించింది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికలలో వెంకట్‌రెడ్డి మళ్ళీ పోటీకి దిగినప్పుడు ఆయనను ఉద్దేశ్యించి, “అసెంబ్లీ ఎన్నికలలో చెల్లని సత్తురూపాయి లోక్‌సభ ఎన్నికలలో చెల్లుతుందా?” అని సిఎం కేసీఆర్‌ఎద్దేవా చేశారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో వెంకట్‌రెడ్డి గెలిచారు. 

ఈ సందర్భంగా ఆయన సోదరుడు మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “సత్తురూపాయి అని తీసిపారేసిన మా సోదరుడే ఎన్నికలలో తెరాస అభ్యర్ధిని ఓడించి చూపారు. మా అన్నయ్య బంగారు నాణెం వంటివారు. కనుక ఒక ఎన్నికలలో ఓడిపోయినంత మాత్రన్న ఆయన విలువ తగ్గిపోదు.... సత్తురూపాయి అయిపోరు. నిజానికి కాంగ్రెస్ నుంచి తెరాస ఎత్తుకుపోయిన మా ఎమ్మెల్యేలు సత్తురూపాయిలు...చిరిగిననోట్లవంటివారు. అటువంటి చిరిగిన నోట్లను పక్కన పెట్టుకొని కేసీఆర్‌ మా అన్నగారిని సత్తురూపాయి అని ఎద్దేవా చేయడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆయన సత్తా ఏమిటో తెరాసకు రుచి చూసింది కదా? డబ్బులు వెదజల్లి అధికారం దుర్వినియోగం చేసి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన తెరాస, రాష్ట్ర ప్రజలందరూ మావైపే ఉన్నారని చెప్పుకోవడం ఆత్మవంచన చేసుకోవడమేనని లోక్‌సభ ఫలితాలు నిరూపించాయి కదా?” అని అన్నారు. 

ఏపీలో వైసీపీ విజయం సాధించడంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. “ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా ఓర్చుకొంటూ పదేళ్ళు పోరాడి జగన్ విజయం సాధించారు. ఆయన కూడా తన తండ్రిగారిలాగే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తారని, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలు నెరవేర్చుతారని ఆశిస్తున్నాను. త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్న జగన్‌మోహన్‌రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను,” అని అన్నారు. 


Related Post