పరిషత్ ఓట్ల లెక్కింపు వాయిదా

May 25, 2019


img

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 27వ తేదీన జరుగవలసి ఉంది. కానీ ప్రతిపక్షాల అభ్యర్ధన మేరకు దానిని వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం జూలై 3తో ముగుస్తుంది. కనుక ఇప్పుడే ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించినట్లయితే గెలిచిన అభ్యర్ధులను ఫిరాయింపులకు ప్రోత్సహించే అవకాశం ఉంది కనుక జూలై 3వరకు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటనను వాయిదా వేయాలని ప్రతిపక్షాలు కోరాయి. ఫలితాలు వెల్లడించిన వెంటనే ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్‌ల ఎన్నిక నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరాయి. వాటి అభ్యర్ధన పట్ల సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని వాయిదా వేస్తునట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి, అప్పటి వరకు బ్యాలెట్ పత్రాలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని కోరింది. ఓట్ల లెక్కింపు చేసే తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.         

మొత్తం 5,817 ఎంపీటీసీ, 538 జెడ్పీటీసీ స్థానాలకు మూడు దశలలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తరువాత ఓట్ల లెక్కింపును దీర్ఘకాలం వాయిదా వేయాలంటే పంచాయతీ రాజ్ చట్టం 2018లో సవరణ చేయవలసి ఉంటుంది. కనుక అందుకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ రాజ్ శాఖను కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించవలసి ఉంది.


Related Post