రిటర్న్ గిఫ్ట్ అందింది...థాంక్స్!

May 24, 2019


img

ఏపీ మాజీ సిఎం చంద్రబాబునాయుడుకు తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇస్తానన్న ‘రిటర్న్ గిఫ్ట్’ అందినట్లే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రయత్నించిన చంద్రబాబుని గద్దె దించడమే ఆ ‘రిటర్న్ గిఫ్ట్’ అని వేరే చెప్పనవసరం లేదు. 

ప్రధాని నరేంద్రమోడీతో సఖ్యతగా ఉన్నంతకాలం నాలుగేళ్ళపాటు తనకు తిరుగేలేదన్నట్లు వ్యవహరించిన చంద్రబాబునాయుడుకి నేడు ఇటువంటి దుస్థితి ఎదురవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు ఆయనకు ఎటు చూసినా శత్రువులే తప్ప మిత్రులు కనబడటం లేదు. రాహుల్, మమతా, దేవగౌడ వంటి మిత్రులు కూడా ఇప్పుడు ఆయనకు సహాయపడగలిగే స్థితిలో లేరు కనీసం ఆయనను ఓదార్చగలిగి స్థితిలో లేరు. ఎందుకంటే లోక్‌సభ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయినందుకు ఇప్పుడు వారికే ఓదార్పు అవసరం. 

ఇంతకాలం అమరావతిని ఏలిన చంద్రబాబునాయుడు ఇప్పుడు అక్కడ ఉండలేరు. అలాగని హైదరాబాద్‌ తిరిగి వెళ్లలేరు. ఈ పరిస్థితులలో డిల్లీలో కూడా అడుగుపెట్టలేరు. టిడిపికి, చంద్రబాబునాయుడుకి ఇటువంటి ఆటుపోటులు ఎదుర్కోవడం అలవాటే కానీ ఈసారి కేసీఆర్‌ ఇచ్చిన ఈ ‘రిటర్న్ గిఫ్ట్’ భరించడం చాలా కష్టంగానే ఉంటుంది. ఇదే ఆఖరి రిటర్న్ గిఫ్టా లేకా కేసీఆర్‌ ఇంకా ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నారా? అనే భయం కూడా ఉంది. ముఖ్యమంత్రి అనే రక్షణ కవచం తీసేసిన తరువాత, ఆ కవచం ధరించి ఉన్నవారితో యుద్ధం చేయడం చాలా కష్టమే కదా?మరిప్పుడు చంద్రబాబునాయుడు ఏమి చేస్తారో చూడాలి.


Related Post