సుపరిపాలన రుచి చూపిస్తా: జగన్

May 24, 2019


img

ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో 175కు 151 సీట్లు గెలుచుకొని తన ముఖ్యమంత్రి కలను నెరవేర్చుకోబోతున్న జగన్‌మోహన్‌రెడ్డి, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తాడేపల్లిగూడెంలో తన నివాసం నుంచి ప్రజలనుద్దేశ్యించి చాలా హుందాగా మాట్లాడారు. 

“ప్రజలు, పైన ఆ దేవుడి ఆశీస్సులతో ఈ విజయం సాధ్యమైంది. ఆరు నుంచి 12 నెలలలోపే రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన ఏవిధంగా ఉంటుందో రుచి చూపించి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొంటాను. ఇంతవరకు ప్రజల తరపున పోరాడిన నాకు ఈ విజయం నా బాధ్యతను మరింత పెంచింది. ఈ ఎన్నికలలో ప్రజలు విశ్వసనీయతకు ఓటు వేశారని భావిస్తున్నాను. నాపై విశ్వాసం ఉంచి గెలిపించిన రాష్ట్ర ప్రజలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. ఈనెల 30న విజయవాడలోనే ప్రమాణస్వీకారం చేస్తాను. 

ఆ సందర్భంగా తొలి సంతకం చేయడం కంటే నా పాదయాత్ర సందర్భంగా నవరత్నాల పేరిట రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆ తొమ్మిది హామీలను అమలుచేయడానికే ప్రాధాన్యత ఇస్తాను. ప్రజలు గతంలో మా తండ్రిగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారి  పాలన చూశారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఆయన పాలనను మరిపించేవిధంగా నా పాలన ఉంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నాను,” అని జగన్ అన్నారు. 

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సమస్యలలో చిక్కుకొంది. ఐదేళ్ళు గడిచిపోయినప్పటికీ ఇంతవరకు పూర్తిస్థాయి రాజధాని ఏర్పాటు కాలేదు. పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి కానీ అవీ ఇంకా పూర్తికాలేదు. గత ప్రభుత్వానికి కేంద్రంతో సఖ్యత లేకపోవడంతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వంతో విభేధాల కారణంగా రాష్ట్ర విభజన సమస్యలు ఇంకా అలాగే ఉండిపోయాయి. వీటన్నిటినీ జగన్ ఒడుపుగా పరిష్కరించవలసి ఉంటుంది. అదే సమయంలో సుపరిపాలన, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంగా అమలుచేయవలసి ఉంటుంది. ఇవన్నీ సమర్ధంగా చేయగలిగితే ఇక ఆయనకు తిరుగు ఉండదు.


Related Post