ఎవరి పంచాంగం వారిదే...

May 22, 2019


img

జాతీయస్థాయిలో బిజెపి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టిడిపి, వైసీపీలు తామే తప్పకుండా భారీ మెజార్టీతో గెలవబోతున్నామని నమ్మకంగా చెపుతున్నాయి. కనుక ఆ మూడుపార్టీల నేతలు చాలా ఆనందంగా ఉన్నారా అంటే కాదనే చెప్పాలి. ఏపిలోని ఒక తెలుగు న్యూస్ ఛానల్ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధుల వద్దకు బీపీ మెషీన్ వెంటబెట్టుకొని వెళ్ళి వారి బీపీలు పరీక్షించగా వారిలో చాలా మందికి బీపీ సామాన్యంగా ఉండవలసిన దానికంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. అంటే ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లుగానే రేపు ఫలితాలు కూడా ఉంటాయా లేక వాటి అంచనాలు తప్పి తాము ఎన్నికలలో ఓడిపోతామా అనే భయం, ఆందోళన అభ్యర్ధులందరిలోను ఉన్నట్లు స్పష్టమైంది. 

తాము 300కు పైగా ఎంపీ సీట్లు గెలుచుకోబోతున్నామని బిజెపి, టిడిపి-110, వైసీపీ 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతున్నామని గట్టిగా వాదిస్తున్నాయి. ఏపీ సిఎం చంద్రబాబునాయుడు తన 40 ఏళ్ళ సుదీర్గ రాజకీయ అనుభవంతో గెలుపు ఖాయమని చెపుతున్నానని అంటుంటే, చంద్రబాబు రాక్షస పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు మే 23ఎప్పుడెప్పుడు వస్తుందా... ఎప్పుడు జగనన్న ముఖ్యమంత్రి అవుతాడా…అని ఆత్రంగా ఎదురుచూస్తున్నారని వైసీపీ నేతలు వాదిస్తున్నారు. 

ఎగ్జిట్‌ పోల్స్‌ తరువాత డీలా పడిపోయిన కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి వాదనలు చేయకుండా నిర్లిప్తంగా మే 23 కొరకు ఆతృతగా ఎదురు చూస్తోంది. దానికి మరింకెంతో సమయం లేదు కూడా. మరొక 16గంటలలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఆ తరువాత రౌండ్లవారీగా ఫలితాలు బయటకు వస్తుంటాయి. కనుక అంతవరకు రాజకీయ పార్టీలకు, వాటి అభ్యర్ధులకు ఈ ఆందోళన, ప్రజలకు ఈ సస్పెన్స్ భరించకతప్పదు.


Related Post