ఎగ్జిట్‌ పోల్స్‌పై టి-కాంగ్రెస్‌ స్పందన

May 22, 2019


img

ఎగ్జిట్‌ పోల్స్‌పై రాష్ట్ర కాంగ్రెస్ గట్టిగా స్పందించలేదనే చెప్పొచ్చు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర స్థాయిలో కూడా కాంగ్రెస్ ఓటమి ఖాయమని తేల్చి చెప్పడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనవడం సహజమే. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు మొహాలు చూపించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్ర కాంగ్రెస్‌ తేరుకోగలదు. కానీ కేంద్రంలో కూడా రాలేకపోతే రాష్ట్ర కాంగ్రెస్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. బహుశః ఆ ఆందోళనతోనే రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎగ్జిట్‌ పోల్స్‌పై గట్టిగా స్పందించలేకపోయారనుకోవచ్చు. 

కానీ టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ఒక్కరే కాస్త గట్టిగా స్పందించారు. ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎంపీలను గెలుచుకోలేదని గ్రహించిన మోడీ సర్కార్, సర్వే సంస్థలను మేనేజ్ చేసి తనకు అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వచ్చేలా చేసుకొని ప్రాంతీయ పార్టీలలో చీలిక తెచ్చి వాటిని తనవైపు తిప్పుకోవాలని ఆలోచిస్తోంది. సర్వే సంస్థలు నిష్పక్షపాతంగా సర్వే చేసి ఉండి ఉంటే, బిజెపికి గతంలో వచ్చిన సీట్ల కంటే ఎన్ని ఎక్కువ వస్తాయి? ఎందుకు వస్తాయో కూడా వివరించి ఉండాలి. కానీ అన్ని సంస్థలు బిజెపి 275-285 సీట్లు గెలుచుకొంటుందని మాత్రమే చెప్పాయి. నిజానికి దేశంలో మోడీ పట్ల అన్ని వర్గాలలో వ్యతిరేకత చాలా పెరిగింది. ఆయన అనాలోచిత నిర్ణయాల వలన తీవ్రంగా నష్టపోయినవారు, నిరంకుశ, మతతత్వ విధానాలను వ్యతిరేకించేవారు ఈ ఎన్నికలలో బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేశారు. కనుక ఈసారి బిజెపి గెలుపు అసంభవం. బిజెపి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్‌ మిత్రపక్షాలను చీల్చలేదు. మిత్రపక్షాల సహాయంతో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు.


Related Post