ఎగ్జిట్‌ పోల్స్‌ ఎఫెక్ట్: బాబు సమావేశానికి అగ్రనేతలు డుమ్మా

May 21, 2019


img

ఎగ్జిట్‌ పోల్స్‌లో కాంగ్రెస్‌-బిజెపిలకు సమానావకాశాలు ఉన్నాయని చెప్పినా లేదా బిజెపి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పినా, కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ఉత్సాహంతో ఉరకలేసేవేమో కానీ బిజెపి 300కు పైగా సీట్లతో మళ్ళీ అధికారంలోకి రాబోతోందని చెప్పడంతో చాలా నిరుత్సాహపడిపోయాయి. ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రభావమో ఏమో తెలియదు కానీ ఈరోజు మధ్యాహ్నం డిల్లీలో కాన్స్టిట్యూషన్‌ క్లబ్‌లో ఏపీ సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన బిజెపియేతర పార్టీల సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేశ్ యాదవ్,శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, కుమార స్వామిలు డుమ్మా కొట్టేశారు. తమకు బదులు తమ పార్టీ ప్రతినిధులను ఆ సమావేశానికి పంపించడంతో వారితోనే చంద్రబాబునాయుడు ‘మమ’ అనిపించేశారు.

కనీసం 50 శాతం వివి ప్యాట్ రసీదులను లెక్కించాలనే ప్రతిపక్షాల అభ్యర్ధనలను సుప్రీంకోర్టు, కేంద్ర ఎన్నికల కమీషన్ పదేపదే త్రోసిపుచ్చుతున్నప్పటికీ, మళ్ళీ మరోసారి దీనిపై చర్చించేందుకు ఈసీని కలవాలని సమావేశంలో నిర్ణయించారు. దాని వలన ప్రయోజనం ఉండదని వారికీ తెలుసు. అంటే ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు కాలక్షేపం కోసమే సమావేశాలు పెట్టుకొంటూ, ఈవిధంగా హడావుడి చేస్తున్నట్లనిపిస్తోంది.


Related Post