కాంగ్రెస్‌ గెలవదు కానీ అధికారంలోకి వస్తుంది: పొన్నం

May 20, 2019


img

ఎగ్జిట్‌ పోల్స్‌లో బిజెపి నేతృత్వంలో ఎన్డీయే కూటమి భారీ మెజార్టీతో మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి రాబోతోందనే జోస్యంపై ప్రతిపక్ష పార్టీల నేతలు ఊహించినట్లుగానే దానితో ఏకీభవించలేదు. 

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ స్పందిస్తూ, “ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వాస్తవ పరిస్థితులకు చాలా దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందని మేము భావించలేదు కానీ మిత్రపక్షాలతో కలిసి తప్పకుండా అధికారంలోకి వస్తుంది. మే 23నా ఫలితాలు వెలువడిన తరువాత బిజెపియేతర పార్టీలన్నీ ఒకే వేదికపైకి రావడం వాటి మద్దతుతో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం,” అని అన్నారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందిస్తూ, “మరొక మూడు రోజులలో ఎలాగూ ఫలితాలు రాబోతున్నాయి. కనుక ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసి ఆందోళన చెందనవసరం లేదు,” అన్నారు. 

 సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ, “ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయే అనుకూల మీడియా సొంత ఊహాగానాలే తప్ప నిజం కావు. అవి ఎన్డీయేకు అనుకూలంగా వీటిని సృష్టించి విడుదల చేశాయని భావిస్తున్నాను. మే 23న అసలు ఫలితాలు ఎలాగూ వెల్లడవుతాయి. అప్పుడు ఏ కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందో స్పష్టం అయిపోతుంది,” అని అన్నారు. 

సిపిఐ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అసలు ఫలితాలకు ఎక్కడా పొంతన ఉండకపోవచ్చునని అన్నారు. దేశప్రజలలో అత్యధికులు నరేంద్రమోడీని వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం అయ్యింది కనుక ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లు ఈసారి బిజెపికి భారీ మెజార్టీ రాకపోవచ్చునని,  కేంద్రంలో హంగ్ ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. 

కేంద్రంలో హంగ్ ఏర్పడుతుందని గట్టిగా వాదించిన  సిఎం కేసీఆర్‌, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎగ్జిట్ పోల్స్ పై ఇంతవరకు స్పందించలేదు. వారెవిధంగా స్పందిస్తారో చూడాలి.


Related Post