ఒడిశాకు సేవలందిస్తున్న టి-విద్యుత్ ఉద్యోగులు

May 16, 2019


img

ఫణి తుఫానుతో విధ్వంసానికి గురైన ఒడిశా రాష్ట్రానికి తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న సేవలకు సర్వత్రా ప్రశంశలు లభిస్తున్నాయి. సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు వెయ్యి మంది విద్యుత్ ఉద్యోగులు మే 7న భువనేశ్వర్ చేరుకొన్నారు. వారు భువనేశ్వర్ చేరుకొన్నప్పుడు ఎక్కడ చూసినా భారీ వృక్షాలు కూలిపోయున్నాయి. కనుక ముందుగా వాటన్నిటినీ తొలగించడానికి వారు చాలా శ్రమపడవలసి వచ్చింది. ఆ తరువాత అసలు పని మొదలు పెట్టారు. 

టిఎస్పిడిసి సూపరిండెంట్ ఇంజనీర్ ఎల్ గోపయ్య నేతృత్వంలో రెండు బృందాలుగా పనిచేస్తున్న విద్యుత్ ఉద్యోగులు కొందరు భువనేశ్వర్‌లో మరికొందరు పూరీలో విద్యుత్ పునరుద్దరణ పనులు చేపట్టారు. గత రెండు వారాలలో వారు మొత్తం 537 విద్యుత్ స్తంభాలను మళ్ళీ వాటి స్థానంలో నిలబెట్టి విద్యుత్ తీగలు అమర్చారు. 74 ట్రాన్స్ఫార్మర్లకు మరమత్తులు చేసి విద్యుత్ సరఫరా పునరుద్దరించారు. సుమారు 34కిమీ పొడవునా విద్యుత్ సరఫరా లైన్లను సరిచేసారు. 

ఫణి తుఫాను కారణంగా ఒడిశా ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది దానిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు తమకు అవసరమైన కొన్ని యంత్రాలు, పరికరాలు, బస చేసేందుకు గుడారాలు, ఆహార పదార్ధాలు వెంట తీసుకువెళ్లారు. త్వరలోనే వారు అక్కడ తమ పని పూర్తిచేసుకొని హైదరాబాద్‌కు తిరిగిరానున్నారు. 

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఇటువంటి పనులు చేయడం చాలా శ్రమతో కూడుకొన్నవని అందరికీ తెలుసు. అదే వేరే రాష్ట్రంలో అయితే మరింత కష్టం. అవసరమైన యంత్ర పరికరాలు, సరైన వసతులు, భోజనం, నిద్ర ఉండవు. అయినప్పటికీ తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి ఒడిశా రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు. అందుకు వారికి అభినందనలు. 


Related Post