హైదరాబాద్‌లో మరో ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌వే

May 15, 2019


img

హైదరాబాద్‌ నగరంలో మరో ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌వే రాబోతోంది. మోహిదీపట్నం నుంచి శంషాబాద్ వరకు గల పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించడానికి దీనిని నిర్మిస్తున్నారు. గత ఏడాది కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ శంఖుస్థాపన చేయగా ఇటీవలే దాని నిర్మాణపనులు మొదలయ్యాయి. 

ఇది పూర్తయితే మోహిదీపట్నం నుంచి మద్యలో ఎక్కడా ఆగకుండా శంషాబాద్‌ విమానాశ్రయానికి కేవలం 18 నిమిషాలలో చేరుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకొనేందుకే వేసినప్పటికీ, శంషాబాద్‌లో విమానాశ్రయం వచ్చిన తరువాత ఆ ప్రాంతమంతా శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఎక్స్‌ప్రెస్‌వేపై రయ్యిమని దూసుకువచ్చిన వాహనాలు శంషాబాద్ వద్దకు చేరుకోగానే ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నాయి. అక్కడి నుంచి కూతవేటు దూరంలో కనిపిస్తున శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోవడానికి అర్ధగంట సమయం పడుతుండటంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పీవీ ఎక్స్‌ప్రెస్‌వేను శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించవలసిందిగా కేంద్రమంత్రి నితిన్ గడ్కారీని కోరాగా ఆయన వెంటనే ఆమోదం తెలపడంతో పనులు మొదలయ్యాయి.  

కొత్తగా నిర్మిస్తున్న ఈ ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌వే శంషాబాద్‌కు కొద్దిగా ముందు మొదలయ్యి విమానాశ్రయం వరకు సాగుతుంది. అది విమానాశ్రయం వద్ద రెండుగా చీలి ఒకటి విమానాశ్రయం రోడ్డువైపు, మరొకటి మరికొంత ముందుకు సాగి హైదరాబాద్‌-బెంగళూరు జాతీయరహదారి వైపు సాగుతుంది. 

ఇది పూర్తయితే హైదరాబాద్‌ నగరవాసులు శంషాబాద్ పట్టణంలో ట్రాఫిక్ లో చిక్కుకోకుండా సులువుగా విమానాశ్రయం చేరుకోవచ్చు. శంషాబాద్ పట్టణంలో చిన్న వాహనాల రాకపోకల కోసం దీని క్రింద నుంచి 500, 770 మీటర్ల పొడవుండే రెండు అండర్ పాస్ రోడ్లు నిర్మిస్తారు. జాతీయరహదారుల శాఖ అధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ఎలివేటడ్ ఎక్స్‌ప్రెస్‌వేను జూలై 2020 లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారు.


Related Post