చివరి నిమిషంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి మార్పు

May 15, 2019


img

ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపికలో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకత్వం తడబడింది. రంగారెడ్డి జిల్లాకు మొదట టీపీసీసీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.ఉదయ్‌ మోహన్‌రెడ్డి పేరును పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం ప్రకటించారు కానీ మంగళవారం ఉదయం కొమ్మూరి ప్రతాపరెడ్డిని పార్టీ అధికారిక అభ్యర్ధిగా ప్రకటించింది. పార్టీ అభ్యర్ది మారినప్పటికీ మొదట ఖరారు చేసిన కె.ఉదయ్‌ మోహన్‌రెడ్డి, ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి కూడా మంగళవారం ఉదయం నామినేషన్లు వేయడం మరో విశేషం.

ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌, తెరాస అభ్యర్ధుల సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకొని శంకరపల్లికి చెందిన ఉదయ్‌ మోహన్‌రెడ్డిని బరిలో దింపాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావించి ఆయన పేరు ప్రకటించారు. కానీ అక్కడి నుంచి చల్లా నర్సింహారెడ్డి పోటీ చేయాలనుకొంటున్నందున ఆయన ఉదయ్‌ మోహన్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. ఆ కారణంగా చివరి నిమిషంలో అభ్యర్ధిని మార్చినప్పటికీ, చల్లా నర్సింహారెడ్డిని కాక జనగామ జిల్లాకు చెందిన కొమ్మూరి ప్రతాపరెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించి బీ-ఫారం అందించడంతో చల్లా నర్సింహారెడ్డి, ఉదయ్‌ మోహన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి చెంది ఇద్దరూ నామినేషన్లు వేశారు. వారిరువురూ తమ నామినేషన్లు ఉపసంహరించుకొంటారో లేక పార్టీ ఆదేశాలను దిక్కరించి ఎన్నికలలో పోటీ చేస్తారో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి తేలిపోతుంది.

రంగారెడ్డిలో జరిగే ఎన్నికలలో జనగామకు చెందిన కొమ్మూరి ప్రతాపరెడ్డిని నిలబెడితే ఆయనను గెలిపించుకోలేమని కాంగ్రెస్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. అభ్యర్ధి ఎంపిక విషయంలో పార్టీలో ఇన్ని సమస్యలున్న కారణంగా తెరాస అభ్యర్ధి పట్నం మహేందర్ రెడ్డి విజయావకాశాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. 

కాంగ్రెస్‌, తెరాస ఎమ్మెల్సీ అభ్యర్ధులు: 

రంగారెడ్డి: కొమ్మూరి ప్రతాపరెడ్డి (కాంగ్రెస్‌), పట్నం మహేందర్ రెడ్డి (తెరాస). 

నల్గొండ: కోమటిరెడ్డి లక్ష్మి (కాంగ్రెస్‌), తేరా చిన్నప్ప రెడ్డి (తెరాస).

వరంగల్: ఇంగుల వెంకట్రామిరెడ్డి(కాంగ్రెస్‌), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి (తెరాస).


Related Post